Site icon HashtagU Telugu

MLC Kavitha : సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్సీ కవిత లేఖ

MLC Kavitha's letter to CM Revanth Reddy

MLC Kavitha's letter to CM Revanth Reddy

MLC Kavitha : హైదరాబాద్‌ వర్షాకాలం నిత్యం సమస్యలతో భాదపడుతున్న నగరవాసులకు భద్రత కల్పించేందుకు ఏర్పాటుచేసే మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ టీమ్స్‌ టెండర్లలో తీవ్ర అవకతవకలు జరిగాయని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆమె లేఖ రాశారు. కవిత తన లేఖలో, జీహెచ్‌ఎంసీ అధికారులు టెండర్ల ప్రక్రియలో పారదర్శకత లేని విధంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. వర్షాకాలానికి సంబంధించి ‘ఇన్‌స్టంట్ రిపేర్ టీమ్స్‌’ పేరుతో కొంతమంది అధికారులు కొన్ని ప్రత్యేక సంస్థలకు మద్దతుగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ టెండర్ల నిబంధనలను విదేశీ సంస్థలకు అనుకూలంగా మార్చారని, వాహనాల విషయంలో విదేశీ కంపెనీలకే అవకాశం కల్పించే విధంగా నిబంధనలు రూపొందించారని కవిత తేల్చి చెప్పారు.

Read Also: Amit Shah : వచ్చే ఎన్నికల్లో బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం

అదే సమయంలో, ఈ మార్పులతో తెలంగాణ బీసీ కాంట్రాక్టర్లకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆమె వివరించారు. రాష్ట్రానికి చెందిన చిన్న కాంట్రాక్టర్లకు అవకాశాలు దూరమవుతుండటమే కాకుండా, కొందరు ఏజెన్సీలకే లబ్ధి చేకూరేలా నిబంధనలను మలిచారని అన్నారు. ఒకే సంస్థకు చెందిన రెండు ఏజెన్సీలకు లబ్ధి కలిగేలా నిబంధనల్ని తయారు చేయడం ద్వారా అసలైన పోటీని విస్మరించారని పేర్కొన్నారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ తొమ్మిది జోన్ల వారీగా టెండర్లు పిలుస్తున్న నేపథ్యంలో, ఈ టెండర్ల మార్పులతో ఏడాదికి ప్రభుత్వంపై రూ.5.85 కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉందని ఆమె లేఖలో హెచ్చరించారు. ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే చర్యగా అభివర్ణించారు.

ఇలాంటి టెండర్ విధానాలు స్థానిక కాంట్రాక్టర్ల హక్కులను హరించడమే కాకుండా, రాష్ట్ర ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీసేలా ఉంటాయని ఆమె స్పష్టం చేశారు. టెండర్లను వెంటనే రద్దు చేయాలని, కొత్తగా పారదర్శక విధానాలతో ప్రక్రియ చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డిని ఆమె కోరారు. ఈ లేఖతో మున్సిపల్ పరిపాలనలో జరుగుతున్న అవకతవకలపై కొత్త చర్చ మొదలైంది. స్థానిక కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు కూడా ఈ వ్యవహారంపై స్పందించే అవకాశముంది.

Read Also: TG : పోలీసు సేవా పతకాలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం