MLC Kavitha: ఆరు గ్యారెంటీల అమలుకు అడుగులు వేయని ప్రభుత్వం, బడ్జెట్ పై కవిత కామెంట్

  • Written By:
  • Updated On - February 14, 2024 / 11:32 PM IST

MLC Kavitha: ఆరు గ్యారెంటీల అమలుకు ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయలేదని, బడ్జెట్ లో మొత్తం ఆత్మస్తుతి, పరనిందలే ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. “సీఎం ప్రజావాణిని వినడం లేదు… ఢిల్లీవాణినే వింటున్నారు. ప్రజావాణికి ఒక్క రోజే హాజరైన సీఎం వారానికి 2 సార్లు ఢిల్లీకి పయనమవుతున్నారు.” అని వ్యాఖ్యానించారు. పాత పద్ధతులే కొనసాగించడానికి కొత్త ప్రభుత్వం ఎందుకు ? అని ప్రశ్నించారు. 2024-25 మధ్యంతర బడ్జెట్ పై బుధవారం నాడు శాసన మండలిలో జరిగిన చర్చలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని మాట్లాడారు. కౌన్సిల్ ప్రతిష్టను, గౌరవ మర్యాదలను భంగపరిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాము సభను స్థంభింపజేసినా ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారో ముఖ్యమంత్రి చెప్పాలని కోరారు.

రానున్న ఐదేళ్లకు పునాది వేసే బడ్జెట్ లో మొదటి ఏడాదే ప్రజలకు ఏం చేస్తారో ప్రభుత్వం చెప్పలేకపోయిందని తప్పుబట్టారు. బడ్జెట్ మొత్తం ఆత్మస్తుతి, పరనిందలతో ఉందని విమర్శించారు. గత ప్రభుత్వంపై నిందలు వేయడం తప్పా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో బడ్జెట్ లో చెప్పలేదని అన్నారు. ఖర్చులేని అంశాలు, వివాదాస్పద అంశాలు, పార్లమెంటు ఎన్నికల వరకు ఏ విధంగా కాలయాపన చేయాలన్న అంశాలు తప్పా కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీల అమలుపై ఎక్కడా చెప్పలేదని వివరించారు. ఆరు గ్యారెంటీలు ఖురాన్, బైబిల్, భగవద్గీత అని ఎన్నికల సమయంలో పదేపదే ముఖ్యమంత్రి ప్రచారం చేశారని, కానీ ఆ గ్యారెంటీల్లో 10 శాతం అంశాలు కూడా బడ్జెట్ లో ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి ప్రతినిత్యం ప్రజలను కలవాల్సిందే అన్న అపోహను కాంగ్రెస్ పార్టీ సృష్టించిందని, ఆ క్రమంలో ప్రజావాణి కార్యక్రమం పేరిట ప్రతి రోజు సీఎం ప్రజలను కలుస్తారని కాంగ్రెస్ ప్రకటించిందని, ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు గడిచినా సీఎం రేవంత్ రెడ్డి కేవలం ఒకరోజు మాత్రమే ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారని ఎత్తిచూపారు. ఇప్పుడు కేవలం ఐఏఎస్ అధికారులే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, గతంలో కేసీఆర్ ప్రభుత్వంలోనూ ఇదే తరహాలో నిర్వహించేవారని, మరి పాత పద్ధతినే కొనసాగించడానికి కొత్త ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు.

ప్రజావాణి వింటామని చెప్పి అధికారంలోకి వచ్చిన వాళ్లు ఢిల్లీవాణి వింటున్నారు తప్పా ప్రజావాణి వినడం లేదని ధ్వజమెత్తారు. ప్రజావాణికి సీఎం ఒక్కసారే వెళ్లారని, కానీ ఢిల్లీకి మాత్రం వారానికి రెండు సార్లు వెళ్తున్నారని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మన రాష్ట్రానికి వస్తే ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేసి ప్రొటొకాల్ ఇచ్చి స్వాగతించే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు తెలంగాణ బస్సును పంపించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఖర్చు కోసం తెలంగాణ ఏటీఎంగా మారిందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో ఒక్క నిమిషం కూడా కరెంటు పోలేదని, ఇప్పుడు హైదరాబాద్ లోనే రోజుకు 3-4 గంటలు కరెంటు పోతుంటే పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రతిష్ట దిగజారిపోతున్నదని మండిపడ్డారు. గత రెండు నెలల్లో సాంఘీక సంక్షేమ హాస్టళ్లలో ముగ్గురు ఆడబిడ్డలను ఆత్మహత్య చేసుకుంటే స్పందించడానికి సీఎంకు తీరిక లేదా అని నిలదీశారు.

బడ్జెట్ లో ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటే దాదాపు రూ. కోటి 36 లక్షల కోట్లు అవరమవుతాయని అంచనా అని, కానీ ప్రభుత్వం ఈ బడ్జెట్ లో కేవలం రూ. 53 వేల కోట్లు మాత్రమే అవసరమవుతాయని ప్రభుత్వం చెప్పిందని వివరించారు. మహాలక్ష్మీ పథకం కింద 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలకు నెలకు రూ. 2500 ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కోటి39 లక్షల మందికి మహాలక్ష్మీ మొత్తం పంపిణీ చేయాలంటే రూ. 49 వేల కోట్లు అవసరమవుతాయని, కాబట్టి ఈ అంశాన్ని ప్రభత్వం బడ్జెట్ లో ప్రస్తావించలేదని ఎండగట్టారు. కళ్యాణ లక్ష్మీ కింద రూ. లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఈ హామీని ఎప్పుడు అమల చేస్తారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. 70 లక్షల మంది మహిళల పేరిట గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు ఉన్నాయని, కేవలం మహిళల పేరిట ఉన్న కనెక్షన్లకే సబ్సిడీ ఇస్తారా లేదా పురుషుల పేరిట ఉన్న కనెక్షన్లకు కూడా ఇస్తారా అన్న అంశంపై స్పష్టత లేదన్నారు. నెలకు ఒక సిలిండర్ మాత్రమే రూ. 500 కు ఇస్తారా లేదా రెండు నెలలకు ఒకసారా అన్నది స్పష్టత లేదని చెప్పారు.

ఏడాదిలో 12 సిలిండర్లకు సబ్సిడీ ఇస్తారని భావిస్తే రూ. 4200 కోట్లు అవసరమవుతాయని, కానీ ఈ మొత్తాన్ని బడ్జెట్ లో ఎక్కడా ప్రస్తావించకపోవడం శోచనీయమన్నారు. వికలాంగులకు కూడా బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. 200 యూనిట్ల లోపు విద్యుత్తును వినియోగించే రాష్ట్రంలో 95.23 లక్షల మీటర్లు ఉన్నాయని, రూ. 6 వేల కోట్లు అవసరమవుతాయని, కానీ బడ్జెట్ లో మాత్రమే చేర్చలేదని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఏటా కనీసం రూ. 20 వేల కోట్లు అవసరమవుతాయని, కానీ ఈ ప్రభుత్వం ప్రజలను దగా చేస్తూ కేవలం రూ. 7 వేల కోట్లను మాత్రమే కేటాయించిందని తెలియజేశారు. అలాగే, 43 లక్షలకుపైగా మందికి ఇప్పటికే పెన్షన్లు అందుతున్నాయని, పెన్షన్ల మొత్తాన్ని పెంచుతామని చెప్పి ఇప్పటికీ పెంచలేదని, మరి పాత పెన్షన్లే ఇచ్చేదుంటే ఇక కొత్త ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. యూత్ డిక్లరేషన్ లో ప్రకటించిన హామీలను బడ్జెట్ లో ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు. ప్రతి అమరవీరుడి కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగమిస్తామని చెప్పారని, నిరుద్యోగ భృతి, ప్రైవేటు రంగంలో 75 శాతం స్థానికులకు రిజర్వేషన్లు కల్పిస్తామని, ఆడబిడ్డలకు ఈ-స్కూటర్ల పంపిణీ, ఫీజు రియింబర్స్ మెంట్ వంటి హామీల అమలు దిశగా ప్రభుత్వం ఒక్క అడుగు కూడా మందుకేయలేదని అన్నారు.