Site icon HashtagU Telugu

MLC Kavitha: మహిళా రిజర్వేషన్లు కల్పిస్తామని బిజెపి రెండుసార్లు మోసం చేసింది!

Mlc Kavitha, chandrababu

Mlc Kavitha

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని బిజెపి రెండుసార్లు హామీ ఇచ్చి మోసం చేసిందని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. భారీ మెజారిటీ ఉన్నప్పటికీ బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని నిలదీశారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ టికెట్ల పంపిణీ పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా కల్వకుంట్ల కవిత మంగళవారం రోజున ట్విట్టర్ ద్వారా తీవ్రంగా స్పందించారు.

స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం ఉన్నది కాబట్టే దేశంలో 14 లక్షల మంది మహిళలు స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు. చట్టసభల్లోనూ రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకురానిదే పరిస్థితులు మార్పు సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో బిజెపి కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు మహిళలకు ఎన్ని టికెట్లు కేటాయిస్తాయో చూద్దామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ టికెట్ల పంపిణీ పై మీరు వెళ్లగకుతున్న అక్కసును తాము అర్థం చేసుకుంటున్నామని, టికెట్లు రాని అభ్యర్థులను లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మీ రాజకీయ అభద్రతభావాన్ని మహిళ ప్రాతినిధ్యానికి ముడి పెట్టవద్దని హితవు పలికారు.

పార్లమెంటు సీట్ల సంఖ్యను పెంచి మూడో వంతు స్థానాలను మహిళలకు రిజర్వ్ చేయాలని సీఎం కేసీఆర్ గారు ప్రతిపాదించారని, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏ చర్య తీసుకుందో చెప్పాలని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. మహిళా హక్కుల పై కిషన్ రెడ్డి ఆందోళన ఆశ్చర్యపరిచినప్పటికీ స్వాగతిస్తున్నానని, చివరికి బిజెపి నుంచి ఎవరోఒకరు సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న డిమాండ్ ను ధ్రువీకరించారని పేర్కొన్నారు.