TS Cabinet: మంత్రివర్గంలోకి కవిత..? నలుగురు ఔట్..?

ఢిల్లీలో బీ ఆర్ ఎస్ పార్లమెంట్ పార్టీని ఏర్పాటు చేసిన కెసిఆర్ (KCR) రాష్ట్రంలో కొత్త మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

  • Written By:
  • Updated On - December 25, 2022 / 08:37 PM IST

ఢిల్లీలో బీ ఆర్ ఎస్ పార్లమెంట్ పార్టీని ఏర్పాటు చేసిన కెసిఆర్ (KCR) రాష్ట్రంలో కొత్త మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇదంతా బీ ఆర్ ఎస్ కు వచ్చే ఎన్నికల్లో కారు గుర్తు కోసం చేస్తున్న ప్రయత్నాలు. పనిలో పనిగా బీజేపీ తో టచ్ లో ఉన్న వాళ్ల ను సాగనంపడానికి కేసీఆర్ సిద్ధం అయ్యారని తెలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన ఒక కీలక మంత్రితో పాటు నలుగురికి ఉద్వాసన పలికే అవకాశం ఉంది. ఇటీవల ఫార్మ్ హౌస్ డీల్ లో ఉన్న ఇద్దరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని వినికిడి.

అంతే కాదు మంత్రివర్గంలోకి కవితను తీసుకునే అంశంపై చర్చిస్తున్నారు. ఒక వేళ ఆమెను లిక్కర్ స్కాములో అరెస్ట్ చేసినప్పటికీ మంత్రి హోదాలో ఉంటే కేసును ఈజీగా డీల్ చేయడానికి ఛాన్స్ ఉందని నిపుణుల అభిప్రాయం. పైగా చాలా కాలం గా మంత్రి పదవి కోసం ఆమె ఎదురు చూస్తున్నారు. ఆమె కోర్కెను ఈ సమయంలోనే తీర్చాలని కేసీఆర్ సన్నిహితుల ఉవాచ. సామాజిక న్యాయం చూపుతూ మంత్రివర్గం మార్పులు ఉంటాయని తెలుస్తుంది.
రెండోసారి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో తొలుత సీనియర్ నేతలు ఈటల రాజేందర్ హరీశ్ రావు కేటీఆర్ లకు చోటు దక్కలేదు. అనంతరం కొంత కాలానికి వాళ్లకు స్థానం కల్పించారు. ఈటలపై ఆరోపణలు మోపి గతేడాది మేలో పదవి నుంచి తొలగించారు. అప్పటినుంచి ఆయన చూస్తున్న ఆరోగ్య శాఖ బాధ్యతలను హరీశ్ కు అప్పగించారు.
ఇటీవల మునుగోడు ఎన్నికకు ముందు వెలుగులోకి వచ్చిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతంలో ఉన్న నలుగురు శాసన సభ్యుల్లో ఇద్దరికి మంత్రి పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది.

ఇక సీనియర్ నేతలు కడియం శ్రీహరి మాజీ స్పీకర్ మధుసూదనాచారి ప్రభుత్వ విప్ బాల్క సుమన్, బండా ప్రకాష్ లలో ఇద్దరు లేదా ముగ్గురికి మంత్రి దక్కొచ్చని వినికిడి. గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన ఓ మంత్రిని తప్పించి మరో ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చే యోచన చేస్తున్నట్లు కూడా చెప్పుకొంటున్నారు. ఈ లెక్కన చూస్తే తెలిసీ తెలియని వ్యాఖ్యలు చేసి జిల్లా ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత ఐటీ దాడులను ఎదుర్కొన్నమంత్రి మల్లారెడ్డిపై వేటు పడుతుందని అర్థమవుతోంది. కార్మిక మంత్రి మల్లారెడ్డి పనితీరుపై సీఎం అయిష్టతతో ఉన్నారని అంటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అత్యంత కీలకంగా భావిస్తోంది. కానీ ఆ శాఖలు చూసే మంత్రులు కొందరు సంబంధిత పథకాల అమలులో చూపుతున్న పనితీరు సీఎంకు నచ్చడం లేదని సమాచారం. సచివాలయం సంక్రాంతికి ప్రారంభించి, ఆ తరువాత అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించి జనవరి మూడో వారం లేదా ఫిబ్రవరిలో కేబినెట్ లో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికలు మరో ఏడాది కూడా లేని వేళ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నారా? కీలక మంత్రులను తప్పించనున్నారా? అంటే ఔను అనే టాక్ ప్రగతి భవన్ వర్గాల్లో ఉంది. వారి స్థానంలో బీసీ, ఎస్సీల నుంచి తీసుకోనున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. సంక్రాంతి తర్వాత సీఎం కేసీఆర్ కేబినెట్ లో మార్పులు చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ మార్పులు కీలకంగా ఉంటాయని తెలుస్తుంది. సంక్రాంతి తర్వాత లేదా ఫిబ్రవరి తొలి వారంలో ముహూర్తం నిర్ణయించినట్లుగా స్పష్టమవుతోంది. మొత్తం మీద ముందస్తు కాస్తా మంత్రివర్గం మార్పు దిశగా కేసీఆర్ అడుగులు వేయటం వ్యూహంలో భాగంగా కనిపిస్తుంది.