తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దాదాపు 65 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ విజయం ఫై బిఆర్ఎస్ నేతలు స్పందిస్తూ వస్తున్నారు.
హరీష్ రావు : రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని,. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రెండు పర్యాయాలు తమకు అధికారాన్ని ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సంపూర్ణ మెజార్టీతో గెలిచిన కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు అని , ప్రజల నమ్మకాలకు అనుగుణంగా కాంగ్రెస్ పాలన కొనసాగాలని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఎన్నికల సమరంలో తమకు అండగా నిలిచిన పార్టీ శ్రేణులు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.
ఎమ్మెల్సీ కవిత : ఈ ఎన్నికల్లో కష్టపడిన BRS కుటుంబ సభ్యుల కృషికి ధన్యవాదాలు. మీరు చేసిన పోరాటానికి సోషల్ మీడియా యోధులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.అధికారం ఉన్నా, లేకున్నా తెలంగాణ ప్రజల సేవకులమే. మనమందరం మన మాతృభూమి కోసం మనస్ఫూర్తిగా కృషి చేద్దాం’’ అని కవిత తెలిపారు.
ఇదిలా ఉంటె కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు కసరత్తు మొదలుపెట్టింది. డిసెంబర్ 9లోపు నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఆ రోజు సోనియా గాంధీ బర్త్ డే. అందుకే ఆమెకు జన్మదిన కానుకగా తెలంగాణ కాంగ్రెస్ విజయాన్ని ఇస్తామని చాలారోజులుగా కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అదే రోజు సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉంది. ఎల్బీస్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై రేవంత్ రెడ్డితో చర్చించామని డీజీపీ తెలిపారు.
Read Also : Kavitha: అధికారంలో ఉన్నా లేకున్నా మేం తెలంగాణకు సేవకులం: కల్వకుంట్ల కవిత