Site icon HashtagU Telugu

MLC kavitha: గవర్నర్ నిర్ణయం.. బీసీలకు అన్యాయం: ఎమ్మెల్సీ కవిత ధ్వజం

Mlc Kavitha, chandrababu

Mlc Kavitha

హైదరాబాద్: గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవుల్లో నామినేట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను తిరస్కరిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయంతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తమది బీసీ వ్యతిరేక పార్టీ అని భారతీయ జనతా పార్టీ మరోసారి నిరూపించుకుందని తేల్చి చెప్పారు. మంగళవారం నాడు శాసనమండలిలో జరిగిన చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవులకు నామినేట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పంపించిన పేర్లను గవర్నర్ తిరస్కరించడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేశారు. దేశంలో భారత రాజ్యాంగం నడుస్తుందా లేదా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం నడుస్తుందా అన్న అనుమానం కలిగే విధంగా పలు రాష్ట్రాల్లో గవర్నర్లు ప్రవర్తిస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

ప్రతీ రాజ్యాంగబద్ధమైన సంస్థకు ఉండే హక్కులు, పరిధులు వాటికి ఉంటాయనీ, అన్నింటినీ గమనిస్తూ ప్రజలను ఒక్కతాటిపై ముందుకు నడిపించాలన్న దాన్ని పక్కన పెట్టి గవర్నర్లు ఇలా వ్యవహరించడం దురదృష్టకరమని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను గవర్నర్ ఆమోదించే సంప్రదాయం ఉందని, దాన్ని విస్మరించి బీసీ వర్గాలకు నష్టం చేయడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఇద్దరు వ్యక్తులు బలహీన వర్గాలకు చెందిన వారిని, ప్రత్యక్ష ఎన్నికల్లో అవకాశాలు రాని వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలన్న సదుద్దేశంతో సీఎం కేసీఆర్ ఇచ్చిన రెండు పేర్లను గవర్నర్ తిరస్కరించడంతో భారతీయ జనతా పార్టీ మరోసారి బీసీ వ్యతిరేక పార్టీ అని నిరూపించుకుందని స్పష్టం చేశారు.

బిజెపి వ్యవహార శైలిని గమనించాలని ప్రజలకు కవిత విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగపరమైన సంప్రదాయాలను పాటించుకుంటూ వెళ్తే అన్ని వ్యవస్థలు కలిసి పనిచేసే ఆస్కారం కలుగుతుందని, తద్వారా ప్రజలకు స్థిరత్వాన్ని అందించగలుగుతామని అన్నారు. నిరంతరం నెగిటివ్ చర్చను రేకెత్తించడం తప్ప దీనివల్ల ఒరిగేదేమీ లేదని చెప్పారు. బీసీ వర్గాలకు బిజెపి ఏ రకంగా అన్యాయం చేస్తుందో మరోసారి గవర్నర్ నిరూపించారని విమర్శించారు. బీసీ వర్గాలను పైకి తీసుకురావడానికి తమ పార్టీ చర్యలు తీసుకుంటుంటే, బిజెపి పార్టీ అందుకు విరుద్ధంగా పనిచేస్తుందని ఆక్షేపించారు. చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో కవితతో పాటు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఎంపీ వెంకటేష్ నేత , బీసి కమిషన్ మెంబర్ కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.