తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) తీవ్ర విమర్శలు చేశారు. నోట్ల బ్యాగుతో దొరికిన వ్యక్తి కావడంతో, ఆయన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్లు నడుచుకుంటున్నారని ఆరోపించారు. బనకచర్ల ప్రాజెక్టు (Banakacharla Project) వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశమైన తర్వాత చంద్రబాబు ప్రాజెక్టు ప్రకటించారని పేర్కొన్నారు. ఏపీ బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణ నీటిని తరలించే ప్రయత్నం జరుగుతుండగా, సీఎం రేవంత్ రెడ్డి సైలెంట్ గా ఉన్నారని విమర్శించారు.
AP Assembly : ఆ భయంతోనే అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్
గతంలో తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి ఇవ్వకపోతే, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్రానికి లేఖలు రాశారని, కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏపీ ప్రాజెక్టు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఎందుకు లేఖ రాయకపోతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టులో కేసులు వేయకపోవడం అనుమానాలకు తావిస్తున్నదని కవిత ఆరోపించారు. తెలంగాణ రైతుల కంటే చంద్రబాబుపై సీఎం రేవంత్ రెడ్డికి ఎక్కువ ప్రేమ ఉందా? అంటూ ఆమె నిలదీశారు. తక్షణమే కేంద్రానికి లేఖ రాయాలని, అవసరమైతే కోర్టును ఆశ్రయించి బనకచర్ల ప్రాజెక్టును నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ఇదే సమయంలో సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసినా రేవంత్ తీరు మారలేదని కవిత వ్యాఖ్యానించారు. కోర్టు ఆయనపై కామెంట్స్ చేయొద్దని హెచ్చరించినా, ఆయన తన తీరును మార్చుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణకు ఇలా జరిగినది దురదృష్టకరమని, తాను రేవంత్ రెడ్డిలా మాట్లాడి తన స్థాయిని తగ్గించుకోవడం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడే బాధ్యత సీఎంకు ఉంటుందని, నీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.