రాష్ట్రంలో బీసీల జనాభాపై కాంగ్రెస్ ప్రభుత్వం కాకిలెక్కలు చెబుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. గతంతో పోల్చితే బీసీల జనాభా ఎలా తగ్గుతుందని ప్రశ్నించారు. అసెంబ్లీలో లఘు చర్చతో లాభం లేదని, స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను పెంచడం కోసం బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. “మేమెంతుంటే… మాకంత వాటా” అంటూ రాహుల్ గాంధీ నినాదం ఇచ్చారని, కాబట్టి ఆ ప్రకారం 46.3 శాతం బీసీలు, 10 శాతం బీసీ ముస్లీంలు… మొత్తం కలిపి 56 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని స్పష్టం చేశారు. రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరిగే రాహుల్ గాంధీ.. బీసీల విషయంలో ఎందుకు వెనక్కితగ్గుతున్నారని నిలదీశారు.
సోమవారం నాడు పెద్దపల్లి జిల్లా పర్యటనకు వెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలో కరీంనగర్ పట్టణంలో సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి ఎమ్మెల్సీ కవిత పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
“2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 83 లక్షల ఇళ్లు… 3.5 కోట్ల జనాభా ఉన్నట్లు తేలింది. 2014 లో కేసీఆర్ నిర్వహించిన సమగ్ర సర్వేలో 1.03 కోట్ల ఇళ్లు, 3 కోట్ల 68 లక్షల జనాభా అని తేలింది. అప్పుడు నాలుగేళ్ల వ్యవధిలో చేసిన సర్వేలోనే 20 లక్షల ఇళ్ళు పెరిగాయి. 2014 నుంచి2024 వరకు పదేళ్ళలో ఎన్ని ఇళ్ళు ఎంత జనాభా ఉండాలి? ఎన్ని కుటుంబాలు పెరగాలి ? కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల చేసిన సమగ్ర కుల సర్వే కోటి 15 లక్షల ఇళ్లు, 3.7 కోట్ల జనాభా ఉన్నట్లు తేలిందని ప్రభుత్వం చెబుతోంది. 2011 నుంచి 14 వరకు 20 లక్షల ఇల్లు పెరిగితే… 2014 నుంచి పదేళ్లలో సుమారు 60 లక్షల కుటుంబాలు పెరగాలి. ఏ లెక్కన చూసినా తెలంగాణలో 50 నుంచి 52 శాతం బీసీలు ఉన్నట్లు తెలుస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 46.2శాతం ఉన్నట్లు తేల్చడం బాధాకరం. ఇది కరెక్టా అని సీఎం రేవంత్ రెడ్డి గుండెమీద చెయ్యి వేసుకొని చెప్పాలి.” అని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ ఇదే తరహాలో బీహార్, కర్నాటకలో మోసం చేసిందని, తెలంగాణలో కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సకల జనుల సర్వేకు, ఇప్పటి ఈ సర్వేకు 21 లక్షల బీసీ జనాభా తేడా కనిపిస్తున్నదని, సకల జనుల సర్వేలో ఓసీల జనాభా చాలా తక్కవ అని తేలిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఈ సర్వేలో చాలా ఎక్కువ కనిపిస్తోందని అన్నారు. దీని వెనుక మతలబు ఏమిటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం ఓసీల జనాభా పెరిగి బీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభా తగ్గుతుందా ? అని ప్రశ్నించారు.
సకల జనుల సర్వే ద్వారా కేసీఆర్ మొదటి అడుగు వేశారని, సకల జనుల సర్వే డేటా ఆధారంగా కేసీఆర్ అనేక పథకాలు, కార్యక్రమాలు నిర్వహించారని పేర్కొన్నారు. అయితే, కాంగ్రెస్ చేసిన సర్వే తప్పులతడఖగా ఉందని ఎండగట్టారు. సర్వే సరిగ్గా జరగలేదని ప్రతి ఒక్కరి మనసుల్లో ఉందని, తమ ఇళ్లకు సర్వే కోసం రాలేదని ప్రతీ గ్రామంలో చాలా మంది అంటున్నారని వివరించారు. సర్వే సరిగ్గా జరగకపోతే డేటా వాస్తవమైనదా కాదా అన్న అనుమానాలు కలుగుతున్నాయని, బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం సర్వే డేటాను సమీక్షకు పెట్టాలని సూచించారు. 3.5 కోట్ల సర్వే పత్రాలను ప్రజల స్క్రూటినీకి అందుబాటులోకి పెట్టాలని, స్ర్కూటినీకి 15 రోజుల సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ జాగృతి, బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు చేసిన ఉద్యమాల వల్ల బీసీ జనాభా వివరాలను ప్రభుత్వం బహీర్గతం చేసిందని, దీన్ని ప్రజాస్వామికవాదులంతా స్వాగతించాలని అన్నారు. తెలంగాణ జాగృతి ఉద్యమాలకు తలొగ్గిన రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ ను ఏర్పాటు చేసిందని, డెడికేటెడ్ కమిషన్ ద్వారానే కులగణన జరగాలని కోరినా ప్రభుత్వం ప్లానింగ్ శాఖ చేత సర్వే చేయించిందని అన్నారు.
మరోవైపు, పెద్దపల్లిలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. “కేసీఆర్ అసలు అసెంబ్లీకి ఎందుకు రావాలి ? మీరేమైన చక్కనైన పనిచేస్తే, నిజాయితీగా పనిచేస్తే, ప్రజలకు పనికొచ్చే పని చేస్తే కచ్చితంగా కేసీఆర్ వస్తారు. అడుగుతారు. మిమ్మల్ని కడుగుతారు. కానీ మీరు మాత్రం ప్రతీ ఒక్క వర్గాన్ని మోసం చేస్తున్నారు” అని అన్నారు. హామీలన్ని విస్మరించిందని, రాజ్యాంగంపై ప్రమాణం చేసి జనవరి 26న రాత్రి రైతు బంధు నిధులు విడుదల చేస్తామన్న ముఖ్యమంత్రి ఇప్పటి వరకు విడుదల చేయలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇవ్వకుండా మొత్తం తెలంగాణను ఎండబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ మీద అక్కసుతో తెలంగాణ రైతాంగం నోట్లో మట్టికొడుతున్నారని అన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తక్షణమే మేడిగడ్డ ప్రాజెక్టును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.