Site icon HashtagU Telugu

MLC Kavitha: పథకాల పేర్లు మార్చే బిజెపి… వాటా మాత్రం పెంచదు!

Mlc Kavitha, chandrababu

Mlc Kavitha

హైదరాబాద్: MLC Kavitha: కేంద్ర ప్రాయోజిత పథకాల పేరులను మార్చుతున్న బిజెపి ప్రభుత్వం… ఆ పథకాల్లో భాగంగా రాష్ట్రాలకు అందించే తన వాటాను మాత్రం పెంచడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. కేంద్రం పథకాలు అమలు కోసం సరిపడా నిధులు ఇవ్వకుండా రాష్ట్రాలపై అదనపు భారం మోపుతుందని తెలిపారు. మధ్యాహ్న భోజన వర్కర్ల వేతనంతో కేంద్ర ప్రభుత్వం తన వాటాను ఒక్క రూపాయి కూడా పెంచకపోవడం బిజెపి నిర్లక్ష్య ధోరణి అర్థమవుతుందని చెప్పారు.

సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తమ వేతనాలను రూ. 3 వేలకు పెంచినందుకుగాను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మధ్యాహ్న భోజన వర్కర్ల కృతజ్ఞతలు తెలియజేశారు. తమ వేతనాల పెంపుదలకు కృషిచేసిన ఆమెను శనివారం నాడు హైదరాబాదులో మధ్యాహ్న భోజన వర్కర్లు కలుసుకొని ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ…. బిజెపి ప్రభుత్వం కేవలం పథకాల పేర్లు మార్చడానికి పరిమితమైందని ధ్వజమెత్తారు. మధ్యాహ్న భోజన పథకం పేరుని పీఎం పోషణ గా మార్చిన కేంద్ర ప్రభుత్వం వర్కర్లకు ఇస్తున్న తన వాటా ను మాత్రం పెంచలేదని విమర్శించారు. మధ్యాహ్న భోజన వర్కర్ల వేతనాలను రూ. 3 వేలకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం తన వాటాగా కేవలం రూ. 600 మాత్రమే చెల్లిస్తుందని, మిగతా రూ. 2400 రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నదని వివరించారు.

ప్రజలంతా గౌరవప్రదంగా జీవించాలన్నదే బీఆర్ఎస్ ప్రభుత్వ విధానమని, అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా కూడా మధ్యాహ్న భోజన వర్కర్ల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని తెలిపారు.