BC Reservations : బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ దీక్షను ఆమె నగరంలోని ధర్నాచౌక్ వద్ద ప్రారంభించారు. దీక్షకు ముందు కవిత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మా జ్యోతిబా ఫులే, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించి, వారి ఆశయాలకు ఆమె అంకితం చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలంగాణ జాగృతి కార్యకర్తలు, బీఆర్‌ఎస్ నాయకులు, బీసీ సంఘాలు హాజరై కవితకు మద్దతుగా నిలిచారు. బీసీలకు సమగ్ర న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ..తెలంగాణలో ప్రతి ఒక్కరికి అధికారంలో భాగస్వామ్యం, ఆర్థిక అవకాశాలు ఉండాలి. బీసీలు సమాజంలో సగం ఉన్నా, వారికి రాజకీయ ప్రాధాన్యం లేదన్న భావనతోనే ఈ దీక్ష చేపట్టాం. కామారెడ్డి డిక్లరేషన్‌లో పేర్కొన్నట్లుగా బీసీలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గత కొన్నేళ్లుగా మనం డిమాండ్ చేస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. కానీ ప్రభుత్వం బీజేపీపై నింద వేసి తప్పించుకోవాలనుకుంటోంది. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ కోసం పార్లమెంటులో ప్రత్యేక బిల్లు తేచి అమలు చేయాలి. నిజమైన చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు ఉంటే ఇది సాధ్యమే అని ఆమె స్పష్టం చేశారు.
కేంద్రం ఆమోదం కోసం నిరసన
2025 మార్చి 17న తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించిన రెండు కీలక బిల్లులు తెలంగాణ బ్యాక్‌వర్డ్ క్లాసెస్, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల బిల్లు మరియు ‘తెలంగాణ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (స్థానిక సంస్థల సీట్ల రిజర్వేషన్) బిల్లు’లు ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదానికి ఎదురు చూస్తున్నాయి. ఈ బిల్లుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ను కల్పించడమే ముఖ్య ఉద్దేశం. కానీ కేంద్రం నుంచి ఆమోదం ఆలస్యం కావడం వల్లనే ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి వచ్చిందని కవిత తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వ అనుమతి లేని దీక్ష
ఈ దీక్షకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లభించకపోయినప్పటికీ, బీసీల హక్కుల కోసం పోరాటం చేయడమే తన ధ్యేయమని కవిత తెలిపారు. అనుమతి లేకపోయిన పరిస్థితుల్లో తెలంగాణ జాగృతి కార్యకర్తలు తదుపరి చర్యలపై ఆలోచనలో ఉన్నారు. దీక్షను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే ప్రజా వ్యతిరేకంగా అభిప్రాయం ఏర్పడుతుందని జాగృతి నేతలు హెచ్చరిస్తున్నారు.
కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు
ఈ సందర్భంగా కవిత కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీలకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదని ఆరోపించారు. బిహార్ ఎన్నికల కోసం ఢిల్లీలో కాంగ్రెస్ చేపట్టిన ధర్నా ముసుగులో డ్రామా అని విమర్శించారు. నిజంగా బీసీల గురించి ఆందోళన ఉంటే, అఖిలపక్షం ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులను ఢిల్లీకి తీసుకెళ్లాలి. కానీ కాంగ్రెస్ పార్టీ దీన్ని రాజకీయం చేసుకుంటోంది అని ఆమె ఆరోపించారు.
చరిత్రలో దీక్షలు – అంబేడ్కర్ విగ్రహం ఉదాహరణ
కవిత తన గత పోరాటాలను గుర్తుచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో అంబేడ్కర్ విగ్రహ స్థాపన కోసం తాను చేపట్టిన 72 గంటల దీక్షను ప్రస్తావిస్తూ, అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చినందువల్లే అసెంబ్లీలో అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణ జరిగిందని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ల సాధన కోసం తన నిరాహార దీక్షను చేపట్టినట్లు చెప్పారు.
నిరాహార దీక్ష – ఉద్యమానికి నాంది
కవిత చేపట్టిన ఈ దీక్షను బీసీ హక్కుల సాధన కోసం ప్రారంభమైన ఉద్యమానికి నాంది అనేలా పరిశీలిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ డిమాండ్‌పై స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని భావిస్తున్నారు. బిల్లులు ఆమోదం పొందితే, రాష్ట్రంలో బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ వ్యవస్థలలో మరింత స్థిరత లభిస్తుందని కవిత అభిప్రాయపడ్డారు. మొత్తం మీద, బీసీల రిజర్వేషన్ల సాధన కోసం కవిత చేపట్టిన దీక్ష రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీక్ష ఎటు తేలుతుందో వేచి చూడాలి.
Read Also: Congress : బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ‘చలో ఢిల్లీ’ ..కాంగ్రెస్ ఉద్యమం ఉధృతం