Minister Jupally: రాబోవు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా ప్రజా ప్రతినిధులు కృషిచేయాలని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally) పిలుపునిచ్చారు. బుధవారం కామారెడ్డి జిల్లాలో సత్య గార్డెన్ లో నిర్వహించిన పట్టభద్ర ఓటర్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల ఆత్మీయ సమ్మేళనంలో టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తో కలసి మంత్రి జూపల్లి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి బారీగా ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి కానుకగా ఇద్దామని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందన్నారు. క్షేత్ర స్థాయిలో కేడర్, లీడర్ కష్టపడి పని చేసి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి విజయానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయ దుందుభి మోగించేందుకు దోహద పడుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకంగా మారుతుందని.. క్షేత్ర స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని భాగస్వామ్యం చేయగలిగితే గెలుపు నల్లేరు మీద నడక అవుతుందన్నారు. తద్వారా రేపటి స్థానిక సంస్థలకు జరగనున్న ఎన్నికల్లో సైతం పార్టీ గెలుపుకు మార్గం సునాయాసం అవుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ప్రభుత్వం సాధించిన విజయాలను విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు.
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించకుండా అన్యాయం చేసిన బీజేపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ఎనిమిది మంది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండి సాధించిందేమీ లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలి, ఎంపీ సురేష్ శెట్కర్, ఎమ్మెల్యేలు లక్ష్మీకాంతరావు, మదన్ మోహన్ రావు, ఇతర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పట్టభద్రులు పాల్గొన్నారు.