MLAs poaching case: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బయటపడ్డ బీజేపీ బాగోతం..!

బీజేపీ నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించడం దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది.

  • Written By:
  • Publish Date - October 28, 2022 / 10:12 PM IST

బీజేపీ నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించడం దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. బీజేపీ కుట్రను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బయటపెట్టగా.. టీఆర్‌ఎస్‌ డ్రామా ఆడుతోందని బీజపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో బీజేపీ తరపున రామచంద్రభారతి బేరసారాలు జరిపిన ఫోన్‌ సంభాషణకు సంబంధించిన ఆడియో బయటికొచ్చింది. ఆ తర్వాత కాసేపటికే ఈ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కుట్రకు సంబంధించి మరో ఆడియో లీక్‌ అయ్యింది. ఈ రెండో ఆడియో కూడా రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది ఆడియోలో నందు అనే వ్యక్తి రామచంద్రభారతి, సింహయాజి అనే ఇద్దరు స్వామీజీలతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోళ్లపై చేసిన సంభాషణలు ఉన్నాయి.

దానిలో రోహిత్ రెడ్డి బిజెపి ప్రతినిధులతో మాట్లాడుతూ తనతో సహా మరో ముగ్గురు బిజెపిలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని, ఆ విషయమై చర్చించేందుకు హైదరాబాద్‌ వస్తే బాగుంటుందని చెప్పగా, అందుకు వారిరువురూ అంగీకరించారు. మొదట వారు వేరే రాష్ట్రంలో ఈ డీల్ మాట్లాడుకొందామని సూచించగా, ప్రస్తుతం మునుగోడు ఉపఎన్నికలు జరుగుతున్నందున అందరి దృష్టి తమపైనే ఉంటుందని, ఈ విషయం ఏమాత్రం బయటకు పొక్కితే కేసీఆర్‌ తమ అంతు చూస్తారని రోహిత్ రెడ్డి చెప్పడంతో వారు హైదరాబాద్‌లో డీల్ మాట్లాడుకోవడానికి ఒప్పుకొన్నారు. మనం డీల్ ఒకే చేసుకోగానే బిజెపిలో ఇటువంటి వ్యవహారాలను చూసే బిఎల్ సంతోష్ మిగిలిన వ్యవహారాలన్నీ చూసుకొంటారని వారు చెప్పారు. మీకు ఈడీ, ఐ‌టి నుంచి ఎటువంటి సమస్యలు రాకుండా మేము చూసుకొంటామని, మీ భద్రత, రాజకీయ భవిష్యత్‌ అంతా కేంద్ర ప్రభుత్వం చూసుకొంటుందని వారు భరోసా ఇచ్చారు. రాష్ట్ర బిజెపి నేతలు దీనిని కేసీఆర్‌ డ్రామాగా కొట్టిపడేస్తున్నప్పటికీ వారి ముగ్గురి సంభాషణ వింటే బిజెపి తరపున టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నించినట్లు స్పష్టంగా అర్దం అవుతుంది.