Vemula Veeresam : పడగొట్టడానికి, కూలగొట్టడానికి గోడలు కావు.. ఇది ప్రజాప్రభుత్వం – ఎమ్మెల్యే వేముల వీరేశం

  • Written By:
  • Publish Date - February 9, 2024 / 01:17 PM IST

బిఆర్ఎస్ నేతలు పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని..పడిబోతుందని అంటున్నారు.. పడగొట్టడానికి, కూలగొట్టడానికి గోడలు కావు..ఇది ప్రజాప్రభుత్వం అంటూ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆవేశంగా చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. పదే పదే బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని పడగొడ్తామంటున్నారు.. పడగొట్టడానికి, కూలగొట్టడానికి గోడలు కావు.. ప్రజాప్రభుత్వం అని అన్నారు. బీఆర్ఎస్ చేసిన పాపాలన్నీ బయటపెడ్తానని తెలిపారు.

కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ అంటే ఎందుకు భయపడుతున్నారు? అని విపక్ష నేతలను ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వం దళితులను అణిఛివేస్తూ అవమానించారని ఆరోపించారు. మనిషిగా చూడని పార్టీ నుంచి గౌరవం లభించే పార్టీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

బీఆర్‌ఎస్‌ నేతలు కూల్చేయడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం బిల్డింగ్‌ కాదని గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రజలకు అనుమతిలేని ప్రగతి భవన్‌ కంచెలు బద్దలు కొట్టామని వ్యాఖ్యానించారు. దళిత బంధు పేరుతో మభ్యపెట్టారని, అధికారంలో ఉన్నామని గర్వం ఉండకూడదన్నారు. అవమానించిన బీఆర్‌ఎస్‌ను విడిచిపెట్టి కాంగ్రెస్‌లోకి వచ్చానన్నారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్‌, పాలమూరు ప్రజలు బీఆర్‌ఎస్‌ నేతలని దూరం పెట్టారని, ఇప్పటికైనా అహంకారం తగ్గించుకోవాలని సూచించారు. తమది దళిత, గిరిజన, మైనార్టీ పక్షపాత ప్రభుత్వం అని, గత ప్రభుత్వం రిజర్వేషన్ల పేరుతో గిరిజనులు, మైనార్టీలను మోసం చేసిందన్నారు. ఆత్మగౌరవం, స్వేచ్ఛ కావాలంటూ ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నామని, గత పదేళ్లుగా నియంతృత్వ విధానాలతో పరిపాలన కొనసాగిందన్నారు.

గత ప్రభుత్వంలో దళిత డిప్యూటీ సీఎంను ఎందుకు పక్కకు పెట్టారని ప్రశ్నించారు. దళిత డిప్యూటీ సీఎంను ప్రజాభవన్ లో కూర్చోబెట్టిన ఘనత కాంగ్రెస్ ది అని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ లు తొలగించారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రజా సంక్షేమానికి కట్టుబడితే ఎందుకు జిల్లాల్లో ఒక్కో సీటుకు పరిమితం అయ్యిందని ప్రశ్నించారు వేముల వీరేశం. బీఆర్ఎస్ మాటలను ప్రజలు నమ్మడం లేదు.. బీఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా గుణపాఠాలు నేర్చుకోవాలని సూచించారు. దళిత బంధు పేరుతో మిగతా నిధులన్నీ పక్కకు నెట్టారని వీరేశం అన్నారు. 2018లో ఇస్తానన్న నిరుద్యోగ భృతి హామీ, దళితులకు మూడెకరాలు భూమి, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నెలల్లో రెండు గ్యారంటీలను అమలు చేసింది..ఇంకో రెండు హామీలు అమలు చేసేందుకు సిద్ధమయ్యిందన్నారు.

Read Also : TS Assembly : అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం..