Site icon HashtagU Telugu

Chikoti Praveen ED Raids : చికోటి చీక‌టి సామ్రాజ్యంలో…

Chikori

Chikori

క్యాసినో నిర్వాహ‌కులు చికోటి ప్ర‌వీణ్ ఆయ‌న పార్ట‌న‌ర్ మాధ‌వ‌రెడ్డిపై ఈడీ చేసిన దాడులు మంత్రి మ‌ల్లారెడ్డి, మాజీ మంత్రి కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు అలియాస్ నాని, ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ మెడ‌కు చుట్టుకుంటున్నాయి. సీజ్ చేసిన డాక్యుమెంట్ల‌లో మ‌నీ ల్యాండ‌రింగ్‌కు సంబంధించిన ప‌త్రాలు ఉన్న‌ట్టు తెలుస్తోంది. పైగా మంత్రి మ‌ల్లారెడ్డి స్టిక్క‌ర్ తో ఉన్న కారును క్యాసినో నిర్వాహ‌కులు ఉప‌యోగించ‌డం పెద్ద దుమారాన్ని రేపుతోంది. గుడివాడ‌లో నిర్వ‌హించిన క్యాసినో వెనుక ప్ర‌వీణ్‌, మాధ‌వ‌రెడ్డి ఉన్నారు. ఫ‌లితంగా ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను క‌దిలించే అంశంగా పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో న‌డుస్తోంది.

బోయినపల్లికి చెందిన చికోటీ ప్రవీణ్ ఆయ‌న పార్టనర్ చిట్టి మాధవరెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. కీలక డాక్యుమెంట్లు, క్యాసినోలతో చేసుకున్న ఒప్పందాలు, హవాలా మార్గంలో తెచ్చిన నగదుకు సంబంధించి ఆధారాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఆ క్ర‌మంలో మాధవరెడ్డి ఇంట్లో ఉన్న ఓ కారుపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి పేరుతో ఉన్న స్టిక్కర్‌ కనిపించడం రాజకీయంగా దుమారాన్ని రేపుతోంది. కారు స్టిక్కర్‌పై మంత్రి మల్లారెడ్డి తనదైన శైలిలో స్పందించారు. కారుపై ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్‌ నాదేనని , కానీ ఆ స్టిక్కర్ 2022 మార్చినాటిదని వివ‌ర‌ణ ఇచ్చారు. మూడు నెలల క్రితమే దాన్ని వాడి పారేశానని మంత్రి చెబుతున్నారు. పడేసిన స్టిక్కర్‌ను ఎవరో పెట్టుకుంటే నాకేంటి సంబంధం? అని మంత్రి ప్రశ్నించారు.

చీకోటి ప్రవీణ్ తో పాటు మాధవరెడ్డి నివాసాల్లో బుధవారం ఉదయం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు సోదాలను ఈడీ నిర్వ‌హించింది. మొత్తం 8 ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరిగాయి. తనిఖీల్లో అనేక అక్రమ లావాదేవీల వ్య‌వ‌హారాన్ని ఈడీ గుర్తించింది. కొంద‌రు ప్రముఖుల డబ్బులను హవాలా రూపంలో విదేశాలకు తరలించినట్లు గుర్తించారు. పలు అనుమానాస్పద లావాదేవీలపై ఈడీ ఆరా తీస్తోంది.

వాళ్లిద్ద‌రూ గోవా, శ్రీలంక, నేపాల్, థాయ్‌లాండ్‌లలో క్యాసినోలు నిర్వహిస్తార‌ని తేలింది. హైదరాబాద్ లోని కొన్ని క్లబ్‌లు వీళ్ల కనుసన్నల్లోనే నడుస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. గత నెలలోనూ చీకోటి జన్మదిన వేడుకలకు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీస్, ఎక్సైజ్‌ అధికారులు హాజరయ్యారని తెలుస్తోంది. కొంద‌రు ప్ర‌ముఖులు ఛార్టర్డ్‌ విమానాల్లో బర్త్ డే వేడుకలకు వచ్చారని చెబుతున్నారు. మొత్తం మీద రాజ‌కీయ‌, సినీ, హ‌వాలా వ్య‌వ‌హారం న‌డుపుతోన్న వాళ్ల వ్య‌వ‌హారం చికోటి ప్ర‌వీణ్‌, మాధ‌వ‌రెడ్డి చీకిటి సామ్రాజ్యంలో ఉంద‌ని తెలుస్తోంది. ఈడీ అధికారులు సీరియ‌స్ గా కేసు విచార‌ణ చేస్తే మాత్రం కొంద‌రు మంత్రులు, మాజీ మంత్రులు, 16 మంది ఎమ్మెల్యేల భాగోతం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.