Rajagopal Reddy Vs Revanth Reddy: మునుగోడు మే సవాల్

కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

  • Written By:
  • Updated On - August 4, 2022 / 10:52 AM IST

కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాజగోపాల్  రాజీనామాపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఒక్కసారిగా మంటలను పుట్టించాయి. కాంట్రాక్టుల కోసమే బీజేపీలోకి వెళ్తున్నారన్న రేవంత్ వ్యాఖ్యల పట్ల మండిపడ్డ రాజగోపాల్ రెడ్డి.. నిజమని నిరూపిస్తే రాజకీయ సన్యాసానికి సిద్ధమని సవాల్ విసిరారు. రేవంత్ ఆరోపణలు అవాస్తవమని తేలితే పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు.

రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో పీసీసీ చీఫ్ రేవంత్ ఆయనపై పలు ఆరోపణలు చేశారు. దీనికి ప్రతిగా రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంట్రాక్టుల కోసం తాను పార్టీ మారుతున్నట్టు రేవంత్ మాట్లాడుతున్నారని.. దీనిని నిరూపించాలని రాజగోపాల్ రెడ్డి సవాల్ చేశారు. అది నిరూపించకుంటే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవిని వదులుకుంటారా? అని నిలదీశారు. రేవంత్ కు పీసీసీ అధ్యక్ష పదవి వచ్చాక తనతో మూడు గంటలు మాట్లాడినట్లు చెప్పడం అబద్ధమన్నారు. ‘‘రేవంత్‌ కు వ్యక్తిత్వం లేదు.. ఆయనో చిల్లర దొంగ.. బ్లాక్‌ మెయిలర్‌. గతంలో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీని తిట్టారు..” అని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు.

 

ఎప్పుడైతే రాజగోపాల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారో.. అప్పట్నుంచే రేవంత్ రెడ్డి దాడి చేయడం మొదలుపెట్టాడు. కాంగ్రెస్ పార్టీ అవ‌కాశాలు ఇవ్వ‌కుంటే… మీరు బ్రాందీ షాపుల్లో ప‌నిచేయ‌డానికి కూడా ప‌నికి రారంటూ రేవంత్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌గోపాల్ రెడ్డి పార్టీని వీడినా ఆయ‌న సోద‌రుడు, భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట రెడ్డి కాంగ్రెస్‌లోనే కొన‌సాగుతార‌ని రేవంత్ రెడ్డి చెప్పారు. ఓ వైపు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్(ED) అధికారులు విచారిస్తుంటే… మ‌రోవైపు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో రాజ‌గోపాల్ రెడ్డి భేటీ అయ్యార‌ని రేవంత్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సోనియాను ఈడీ వేధిస్తుంటే… శ‌త్రువుతో భేటీ అవుతారా? అని ఆయ‌న మండిప‌డ్డారు. ఇటు రాజగోపాల్ రెడ్డి, ఇటు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మునుగోడు ప్రజలు ఎవరి వెంట వస్తారో త్వరలో తెలుస్తోంది.