Site icon HashtagU Telugu

50 Years of Journey Book: ‘50 ఏళ్ల ప్రయాణం’ పుస్తక ఆవిష్కరణ.. బీఆర్ఎస్ మాజీ మంత్రి క‌థ ఇదే!

50 Years of Journey Book

50 Years of Journey Book

50 Years of Journey Book: మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొప్పుల ఈశ్వర్ రచించిన ‘50 ఏళ్ల ప్రయాణం’ పుస్తక (50 Years of Journey Book) ఆవిష్కరణ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు కొప్పుల ఈశ్వర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాల్లో ఉన్నవారు, రాజకీయాల్లోకి రావాలనుకునేవారు ఈ పుస్తకాన్ని తప్పక చదవాలని సూచించారు. ఈశ్వర్‌తో తనకు 24 ఏళ్ల అనుబంధం ఉన్నప్పటికీ, ఈ పుస్తకం ఆయనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించిందని అన్నారు.

హరీష్ రావు ఈశ్వర్‌ను ఎప్పుడూ శాంతమైన, ప్రేమగల, ఆప్యాయమైన వ్యక్తిగా చూశామని, కోపం లేదా అసహనం ఆయనలో కనిపించలేదని చెప్పారు. అయితే, ఈ పుస్తకం చదివిన తర్వాత ఈశ్వర్‌లో గొప్ప పోరాట యోధుడు కనిపించాడని, కార్మికుల కోసం జావీద్, జాఫర్‌లపై ఆయన చేసిన పోరాటం ఆశ్చర్యకరమని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో అందరూ పనిచేసినప్పటికీ, కార్మిక, విప్లవ, తెలంగాణ ఉద్యమాలు.. మూడు ఉద్యమాల్లో పాల్గొన్న ఘనత ఈశ్వర్‌దని గుర్తుచేశారు. ఈ మూడు ఉద్యమాల్లో జైలుకు వెళ్లిన ఏకైక వ్యక్తి ఈశ్వర్ అని హరీష్ రావు పేర్కొన్నారు.

Also Read: Crude Oil Drop: 47 నెల‌ల త‌ర్వాత గణనీయంగా త‌గ్గిన క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు.. భార‌త్‌లో ధ‌ర‌లు త‌గ్గుతాయా?

కూలీ నుంచి కేబినెట్ మంత్రి వరకు ఈశ్వర్ ప్రస్థానాన్ని అద్భుతంగా వివరించిన రచయిత మల్లన్నకు హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయ నాయకులు ఆదర్శవంతమైన మాటలు చెప్పినా, ఆదర్శవంతమైన జీవితాన్ని ఆచరించిన వ్యక్తి ఈశ్వర్ అని కొనియాడారు. ఈశ్వర్ సతీమణి స్నేహలతగా తెలిసినా, ఆమె అసలు పేరు కోకిల అని ఈ పుస్తకం ద్వారా తెలిసిందని, ఆమె వల్లే ఈశ్వర్ జీవితం మారిందని చెప్పారు. కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో పాల్గొన్నప్పటికీ, నవరాత్రుల్లో దేవీ దీక్ష తీసుకునేంత భక్తి ఈశ్వర్‌లో ఉందని తెలిపారు.

బీఆర్ఎస్ తరపున కేసీఆర్ నాయకత్వంలో ఈశ్వర్ వరుసగా ఆరుసార్లు ఓటమి ఎరుగకుండా విజయాలు సాధించారని, అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ఘనత ఆయనదని హరీష్ రావు గుర్తుచేశారు. కేసీఆర్ లేని లోటును తెలంగాణ ఎలా భావిస్తుందో, ధర్మపురి ప్రజలు కూడా కొప్పుల లేని నియోజకవర్గాన్ని చూసి బాధపడుతున్నారని అన్నారు. భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయని, కొప్పుల‌ ఈశ్వర్ మరింత ఉన్నత స్థానానికి ఎదిగి ప్రజలకు సేవ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నమ్మిన సిద్ధాంతం కోసం నిరంతరం శ్రమించిన ఈశ్వర్ గుణాన్ని ఈ తరం నాయకులు నేర్చుకోవాలని సూచించారు.