Miyapur Tragedy : హైదరాబాద్ నగరంలోని మియాపూర్ ప్రాంతంలో ఓ భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. మక్త మహబూబ్‌పేటలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. మృతుల్లో రెండేళ్ల చిన్నారి కూడా ఉండటం మరింత కలచివేసింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతులను లక్ష్మయ్య (60), వెంకటమ్మ (55), అనిల్ (32), కవిత (24), అప్పు (2)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఇంట్లోని పరిస్థితులను పరిశీలించారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ప్రాథమిక దర్యాప్తులో, పసికందును హత్య చేసి మిగిలిన కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే, ఈ ఘటన వెనుక ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లేదా లేఖ లభించలేదని అధికారులు తెలిపారు. ఈ కుటుంబం కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా సేడం మండలం రంజోలి గ్రామానికి చెందినదని, కొద్ది కాలంగా జీవనోపాధి కోసం హైదరాబాద్‌లో స్థిరపడిందని పోలీసులు వివరించారు.
Telangana : పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు !
ఇదిలా ఉంటే, మియాపూర్ ఘటనతో పాటు చందానగర్‌లో కూడా ఒక మృతదేహం లభ్యమైంది. అక్కడి ఓ నాలాలో మహిళ మృతదేహం కొట్టుకువచ్చింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం, ఆ మహిళ చేతిపై ‘నర్సమ్మ’ అనే పేరుతో పచ్చబొట్టు ఉంది. దాని ఆధారంగా మృతురాలి గుర్తింపుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
మృతదేహం వద్ద లభించిన పర్సు, అందులో ఉన్న కమ్మలు, బ్రాస్ లెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు ఘటనలతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన మియాపూర్ ఘటన వెనుక కారణాలేంటో పోలీసులు తెలుసుకోవడానికి దర్యాప్తు వేగవంతం చేశారు. అదే సమయంలో చందానగర్‌లో లభించిన మహిళ మృతదేహం కేసులో కూడా పూర్తి వివరాలను వెలికితీసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
Teenmar Mallanna : తెలంగాణ రాజకీయాల్లో బీసీల కొత్త శకం ప్రారంభమా? తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటన..!