Site icon HashtagU Telugu

New schemes : “మిషన్ 26 డేస్”..జూన్ 2 న తెలంగాణలో కొత్త పథకాలు.. !

"Mission 26 Days"..New schemes in Telangana on June 2nd..!

"Mission 26 Days"..New schemes in Telangana on June 2nd..!

New schemes : తెలంగాణ ప్రజలకు ఓ శుభవార్త. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల్లో ఆశలు రగిలిస్తోంది. రాష్ట్రాభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలిచే ఈ రోజు నాడు ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకి మరింత దగ్గరయ్యేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం “మిషన్ 26 డేస్” పేరిట వారం పది రోజుల పాటు నూతన సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలో జూన్ 2న ‘రాజీవ్ యువ వికాసం’ అనే పథకాన్ని ప్రారంభించబోతోంది. ఈ పథకం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు, శిక్షణా కార్యక్రమాలు, ఉద్యోగ అవకాశాలపై దృష్టి పెట్టనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాలనను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు గ్రామ పాలన అధికారులకు నియామకాలు జరగనున్నాయి. ఇదే రోజు నిరుపేదల ఆశల పునాది అయిన ఇళ్లు నిర్మాణానికి శ్రీకారం చుడుతూ ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవాలను కూడా నిర్వహించనున్నారు.

Read Also: Colombia : ఫలించిన భారత్‌ దౌత్యం..ఉగ్రవాదంపై భారత్ వైఖరికి కొలంబియా సంపూర్ణ మద్దతు

ఇక రాష్ట్ర రైతాంగానికి ఇది నిజంగా ఉత్సవంలాంటి రోజు. ఇప్పటివరకు రైతు భరోసా పొందని అర్హులైన రైతులకు జూన్ 2న నిధులు జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ చర్య ద్వారా వేలాది మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. జూన్ 3న భూ సమస్యలపై ప్రత్యేకంగా సదస్సులు నిర్వహించనున్నారు. భూ పత్రములు, పట్టాదారుల హక్కులపై వస్తున్న సమస్యలకు పరిష్కార మార్గాల కోసం అధికారులతో సహా ప్రజలు ముఖాముఖిగా మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ సదస్సులు ప్రజల సమస్యలపై సత్వరంగా చర్యలు తీసుకునేలా మార్గదర్శకంగా ఉండనున్నాయి.

రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించేందుకు పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజల భాగస్వామ్యంతోనే పాలనకు రూపమివ్వాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పాన్ని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాల రూపకల్పన జరిగింది. ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దిశగా మరో మెట్టు ఎక్కబోతున్నట్లు స్పష్టమవుతోంది. సంక్షేమం, యువత భవితవ్యం, వ్యవసాయం, హౌసింగ్‌, భూ సమస్యలు అన్ని రంగాలపైనా దృష్టి సారిస్తూ, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని సార్థకంగా చేసేందుకు సిద్ధమైంది రేవంత్ రెడ్డి సర్కార్.

Read Also: Corona Alert: ఏలూరు కలెక్టరేట్‌లో నలుగురికి కోవిడ్‌ పాజిటివ్