KTRs Convoy : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్‌లో అపశృతి చోటు చేసుకుంది. ఆదివారం కరీంనగర్ పర్యటనకు కేటీఆర్ వెళ్లారు. కేటీఆర్ కాన్వాయ్‌లో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్త శ్రీకాంత్ బైక్.. మహిళా కానిస్టేబుల్ పద్మజను ఢీకొట్టింది. దీంతో కానిస్టేబుల్ పద్మజ కాలికి గాయమైంది. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆమెను చికిత్స నిమిత్తం హుటాహుటిన స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై కేటీఆర్ ఆరా తీశారు. మహిళా కానిస్టేబుల్ పద్మజకు మెరుగైన వైద్యం అందించాలని సదరు ఆస్పత్రి వైద్యులను ఆయన కోరారు.
Also Read :Honeyguide : ఏఐ బర్డ్ కాదు.. ‘హనీ’ బర్డ్.. తేనె తుట్టెల అడ్రస్ చెబుతుంది
బీఆర్ఎస్ రజతోత్సవ సభపై చర్చ
బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటై 25 ఏళ్లు కావస్తోంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ వేదికగా మార్చి 27న రజతోత్సవ సభను బీఆర్ఎస్ నిర్వహించనుంది. ఈసభ ఏర్పాట్లపై స్థానిక బీఆర్ఎస్ శ్రేణులతో ఇవాళ కేటీఆర్(KTRs Convoy) చర్చించారు. ‘‘రేవంత్ రెడ్డి 14 నెలల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకంజలోకి వెళ్లిపోయింది. ఉచిత పథకాల పేరుతో హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా హామీలకు రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ తిలోదకాలు ఇచ్చింది’’ అని ఈసందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. త్వరలోనే ఎంతోమంది ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్‌లో చేరబోతున్నారని ఆయన వెల్లడించారు.
Also Read :Betting Apps : బెట్టింగ్ యాప్స్ వ్యవహారం.. బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లపై ఫిర్యాదు
నేను కేసీఆర్ అంత మంచోడ్ని కాదు : కేటీఆర్
‘‘ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త ఒక్కో కేసీఆర్‌లా మారిపోయి, ప్రత్యర్ధి పార్టీలను ఎదుర్కోవాలి. ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఎమర్జెన్సీ రాజ్యం. పోలీసులు కేవలం బీఆర్ఎస్ వాళ్లను టార్గెట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఏమన్న పోస్ట్‌లు పెట్టగానే అరెస్ట్‌లు చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్లను టార్గెట్ చేయడమే డ్యూటీగా పెట్టుకున్నారు. మాకూ టైమ్ వస్తుంది. ఏ ఒక్కరినీ వదలబోం. నేను కేసీఆర్ అంత మంచోడ్ని కాదు. అందరి చిట్టాలు విప్పుతా. పోలీసు ఉన్నతాధికారులు ఒక వేళ రిటైర్ అయిపోయి ఇతర దేశాలకు వెళ్లి దాక్కుంటామన్న వదలం. లాక్కొచ్చి ఒక్కొక్కరి చరిత్రల్ని బైటకు తీస్తాం’’ అని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.