తెలంగాణ రాష్ట్రం ప్రకృతి సంపదలో మరో అరుదైన అధ్యాయం ప్రారంభమైంది. ములుగు జిల్లాలోని పస్రా, తాడ్వాయి, లక్నవరం అటవీ ప్రాంతాల్లో తాజాగా జరిగిన ప్రత్యేక సర్వేలో మొత్తం 80 కొత్త రకాల సీతాకోకచిలుక జాతులను గుర్తించారు. ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ ఆధ్వర్యంలో అటవీ శాఖ పర్యవేక్షణలో జరిగిన ఈ సర్వేలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 60 మందికి పైగా పరిశోధకులు, పర్యావరణ నిపుణులు, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు. ఈ పరిశోధన ఫలితాలు ములుగు అడవుల్లో ఉన్న జీవ వైవిధ్యానికి స్పష్టమైన నిదర్శనంగా నిలిచాయి.
Alcohol: ఏంటి ఇది నిజమా! చలికాలంలో మద్యం తాగితే చలి తగ్గుతుందా?
ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ అధ్యక్షుడు ఇందారం నాగేశ్వరరావు వివరాల ప్రకారం, ములుగు ప్రాంతం పర్వతప్రాంతాలు, నీటివనరులు, సహజ వాతావరణం కారణంగా సీతాకోకచిలుకల వాసానికి అనుకూలంగా ఉందని తెలిపారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతాల్లో పర్యావరణ మార్పులు, వాతావరణ సవాళ్ల మధ్య కూడా జీవవైవిధ్యం ఎలా కొనసాగుతోందో తెలుసుకునేందుకు ఈ సర్వే ఎంతో ఉపయోగకరంగా నిలిచిందన్నారు. ఇప్పటివరకు తెలంగాణలో సుమారు 150 సీతాకోకచిలుక జాతులు నమోదయ్యాయని, తాజాగా గుర్తించిన 80 కొత్త జాతులతో రాష్ట్ర జీవ వైవిధ్యం మరింత వైభవం సంతరించుకుందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ మాట్లాడుతూ.. సీతాకోకచిలుకలు పర్యావరణ సమతుల్యతకు ప్రతీకలు అని, ఇవి పూల పరాగసంపర్కం ద్వారా సహజ వృక్షవృక్షాల వ్యాప్తికి సహాయపడతాయని చెప్పారు. అరుదైన జాతులను గుర్తించి వాటి సంరక్షణకు కృషి చేస్తున్న పరిశోధకులు, పర్యావరణ కార్యకర్తలను ఆయన అభినందించారు. ములుగు అడవుల జీవవైవిధ్యాన్ని రక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొంటూ, ఇలాంటి పరిశోధనలు తెలంగాణను దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణలో ప్రత్యేక స్థానంలో నిలిపేలా చేస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
