Minor Girl: పబ్ కెళ్లిన మైనర్.. కారులో గ్యాంగ్ రేప్!

హైదరాబాద్ లోని ఓ పబ్‌లో పార్టీ చేసుకుని తిరిగి వస్తున్న ఓ టీనేజీ యువతిపై

  • Written By:
  • Updated On - June 4, 2022 / 11:48 AM IST

హైదరాబాద్ లోని ఓ పబ్‌లో పార్టీ చేసుకుని తిరిగి వస్తున్న ఓ టీనేజీ యువతిపై గత శనివారం జూబ్లీహిల్స్ లో కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 17 ఏళ్ల బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసును నమోదు చేశారు. అయితే, ఆమెను వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ భరోసా సెంటర్‌కు పంపగా, తనపై సామూహిక అత్యాచారం జరిగినట్లు మహిళా అధికారులకు వెల్లడించింది. ఆమె ముఖం, మెడపై గాయాలను గమనించిన ఆమె కుటుంబ సభ్యులకు అనుమానం కలిగింది. ఆమెను ప్రశ్నించగా, కొంతమంది గుర్తు తెలియని యువకులు తనతో అసభ్యంగా ప్రవర్తించారని చెప్పింది. లైంగిక వేధింపులకు గురైనట్టు పేర్కొంది. బాలిక వాంగ్మూలం ఆధారంగా, జూబ్లీహిల్స్ పోలీసులు అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. యువకులను గుర్తించేందుకు బృందాలను ఏర్పాటు చేశారు.

పబ్ నిర్వాహకులు, సిబ్బంది, పార్టీకి వచ్చిన అతిథులు, బాధితురాలి స్నేహితులను విచారిస్తున్నారు. నిఘా కెమెరాల్లోని దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నారు. ఇద్దరు నిందితులు ప్రజాప్రతినిధుల కుమారులు, మైనర్లు అనే ఆరోపణలు రావడంతో.. అది నిజమో కాదో దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. గత శనివారం బాధితురాలు స్నేహితుడితో కలిసి పబ్‌కు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా, పబ్‌లో ఆమెను కలిసిన కొందరు యువకులు ఆమెను ఇంటి వద్ద దింపుతామని  చెప్పి కారులో ఎక్కించుకున్నారు. ఆ యువతిపై యువకులు కారులోనే గ్యాంగ్ రేప్ జరిపారు. కాగా మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటనపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి, ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మహమూద్‌ అలీ, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ ఎం మహేందర్‌ రెడ్డి, సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌లను కూడా మంత్రి ట్విట్టర్‌లో కోరారు. ఈ వ్యవహరంలో హోంమంత్రి మనువడి పేరు తెరపైకి రావడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి క్లీన్ చీట్ ఇచ్చారు. ప్రస్తుతం మైనర్ పై గ్యాంగ్ రేప్ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.