Minister Uttam Kumar: సూర్యాపేట జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలను పటిష్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar) స్పష్టం చేశారు. సూర్యాపేట మెడికల్ కళాశాల మొదటి స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన.. ఈ కళాశాలకు జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చేందుకు మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామ్యోల్, సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణా రెడ్డి, జిల్లా కలెక్టర్ నందలాల్ తేజస్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ తదితరులు హాజరయ్యారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కళాశాల నిర్వాహకుల అభ్యర్థన మేరకు ప్రాంగణంలో 1000 సీట్ల సామర్థ్యంతో ఆడిటోరియం నిర్మాణం కోసం ఒక కోటి రూపాయల నిధులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, విద్యార్థుల సౌలభ్యం కోసం రెండు బస్సులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్య బాధ్యత వైద్య విద్యార్థుల భుజస్కంధాలపై ఉందని, ఈ విషయాన్ని ఎవరూ విస్మరించకూడదని ఆయన విద్యార్థులకు ఉద్బోధించారు.
Also Read: Earthquake: నేపాల్‌లో మరోసారి భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత ఎంతంటే?
సమాజానికి వైద్య సేవలు అందించడంలో వైద్యుల పాత్ర కీలకమని, వైద్య విద్యార్థులు ఈ బాధ్యతను గుర్తించాలని సూచించారు. స్నాతకోత్సవంలో ఎంబీబీఎస్ పూర్తి చేసి బయటకు వెళ్తున్న విద్యార్థులను ఆయన అభినందించారు. వైద్య విద్యార్థులకు తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు.
సూర్యాపేట ప్రభుత్వ వైద్య కళాశాల 2023లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ప్రారంభించబడింది. 10.54 ఎకరాల విస్తీర్ణంలో ఐదు అంతస్తులతో 114 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితమైన ఈ కళాశాలలో 150 మెడికల్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కళాశాలను మరింత అభివృద్ధి చేసి, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.