రైతులకు విత్తనాల కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులు, విత్తన కంపెనీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించిన తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్రంలో విత్తనాల లభ్యత, విత్తన రంగం అభివృద్ధిపై చర్చించారు. ప్రధానంగా విత్తనాల సరఫరా, రాబోయే సీజన్‌లో రైతులకు నాణ్యమైన విత్తనాలు (ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న) లభ్యతపై మంత్రి తుమ్మల దృష్టి సారించారు. తెలంగాణ రైతులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని విత్తన కంపెనీలను ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రంలో నకిలీ విత్తనాలు సరఫరా కాకుండా చూడాలని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నకిలీ విత్తనాల వల్ల రైతులకు నష్టం జరిగితే విత్తన కంపెనీలే బాధ్యత వహించి రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, విత్తన ధ్రువీకరణ సంస్థ, విత్తనాభివృద్ధి సంస్థ, విత్తన కంపెనీల ప్రతినిధులు, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Also Read: Petrol Diesel Price Today: ఏపీ, తెలంగాణలలో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!