Site icon HashtagU Telugu

Palm Oil Farmers: పామాయిల్ రైతుల‌కు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి తుమ్మ‌ల‌

Palm Oil Farmers

Palm Oil Farmers

Palm Oil Farmers: తెలంగాణ పామాయిల్‌ రైతులకు (Palm Oil Farmers) మంత్రి తుమ్మ‌ల‌ దసరా కానుక‌గా గుడ్ న్యూస్ చెప్పారు. పామాయిల్ గెల‌ల ధ‌ర రూ.17,043కు పెరిగినట్లు మంత్రి తెలిపారు. పామాయిల్ రైతుల కుటుంబాలలో ముందే దసరా పండగ వ‌చ్చింద‌ని మంత్రి తుమ్మల నాగేశ్వ‌ర‌రావు అన్నారు. పామాయిల్ రైతులకు అధిక ధరలను అందించి, రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును లాభసాటిగా చేసి కొత్త రైతులను ప్రోత్సహించాలనే ఉద్ధేశ్యంతో ముడిపామ్ ఆయిల్ పై దిగుమతి సుంకాన్ని తిరిగి విధించి దేశీయ పామ్ ఆయిల్ రైతులను ఆదుకొనేవిధంగా చర్యలను తీసుకోవాలని ఇటీవల మంత్రి తుమ్మల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ గానికి కోరిన విషయం తెలిసిందే.

ఇందుకనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ముడి పామాయిల్ పై దిగుమతి సుంకాన్ని 5.5 % నుండి 27.5 %కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనివలన ముడిపామాయిల్ గెలల ధర రూ. 14,392 నుండి అమాంతం రూ. 2651 పెరిగి ప్రస్తుతం రూ. 17,043 చేరుకుంది. పెరిగిన ధరలు ఈ నెల నుంచే అమలులోకి రానున్నాయి. దీనివలన రైతులకు ఈ నెలలో అదనంగా రూ. 12 కోట్లు లబ్ధి చేకూరనుంది. గతంలో ముడిపామ్ ఆయిల్ దిగుమతిపై సుంకం ఎత్తివేయడం వలన ఆయిల్ పామ్ గెలల ధర తగ్గి రైతులు నిరాశ పడడమే కాకుండా, కొత్తగా ఆయిల్ పామ్ వైపు సాగు వేయాలనుకున్న రైతులపై ప్రతికూల ప్రభావం చూపించిందని మంత్రిగారు పేర్కొన్నారు.

Also Read: New Rules: అక్టోబ‌ర్‌లో మారిన రూల్స్ ఇవే.. ఖ‌చ్చితంగా తెలుసుకోవాల్సిందే.!

ఇది దృష్టిలో ఉంచుకుని, ఇటీవల మన రాష్ట్రానికి విచ్చేసిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కి ఈ విషయంపై మంత్రి తుమ్మలతో పాటు ఆయిల్ పామ్ రైతులు కూడా ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. మంత్రి చొరవతో సెప్టెంబర్ 13న కేంద్ర ప్రభుత్వం ముడిపామ్ ఆయిల్ దిగుమతిపై సుంకాన్ని 5.5 % నుండి 27.5 % కు పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 44,444 ఎకరాల పామ్ ఆయిల్ తోటల నుండి సాలీన 2.80 లక్షల టన్నుల ఆయిల్ పామ్ గెలల దిగుబడి రావడం జరుగుతుంది. ఈ ధరల పెరుగుదల వలన 9,366 మంది ఆయిల్ పామ్ రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. పామ్ ఆయిల్ దిగుమతిపై భారత ప్రభుత్వానికి సంవత్సరానికి 80 వేల కోట్ల రూపాయల విదేశిమారక ద్రవ్యం ఖర్చవుతుందని, దిగుమతి సుంకాలు విధించడం వలన దేశంలోని పామ్ ఆయిల్ రైతులు, ముఖ్యంగా తెలంగాణ పామ్ ఆయిల్ రైతులు ప్రయోజనం పొందుతారని, అంతేకాకుండా గెలల ధరల పెరుగుదల వలన నూతనంగా రైతులు పామ్ ఆయిల్ వైపు మొగ్గు చూపే అవకాశం ఏర్పడనుందని మంత్రి పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం (31) జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణ చేపట్టేందుకు (14) కంపెనీలకు అనుమతులివ్వడం జరిగిందని, ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో సుమారు 2.23 లక్షల ఎకరాలను ఆయిల్ పామ్ సాగు కిందకు తీసుకురావడమైందన్నారు. పెరిగిన ధరల నేపథ్యంలో రాష్ట్రంలో చాలా మంది రైతులు పామాయిల్ సాగు వైపు చూసే అవకాశం ఉందని, కావునా ఆయిల్ పాం కంపెనీలు ఇందుకోసం సన్నద్ధం కావాలని మంత్రిగారు కోరారు. పామ్ ఆయిల్ సాగు చేయాలనుకునే రైతుల కోసం పామాయిల్ మొక్కలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. పామాయిల్ రైతుల సంక్షేమం, ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎళ్లవేలలా కృషి చేస్తుందని, ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.