Speaker Nomination: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పాలనాపరంగా దూకుడు పెంచింది. సీఎం రేవంత్ రెడ్డి హాయంలో ఇప్పటికే తొలిదశ మంత్రి వర్గ కూర్పు జరిగింది. ఇక స్పీకర్ పదవికి నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. మరోవైపు తెలంగాణ శాసనసభ స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ క్రమంలో స్పీకర్ పదవి నామినేషన్‌కు కేటీఆర్‌ను ఆహ్వానించారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయానికి వెళ్లి కేటీఆర్‌ను కలిసిన మంత్రి శ్రీధర్ బాబు నామినేషన్‌కు ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి కేటీఆర్ వెళ్లి స్పీకర్ నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు.
కాంగ్రెస్ పార్టీ స్పీకర్ అభ్యర్థిగా మాజీ మంత్రి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ పేరును రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. స్పీకర్ పదవికి ఇప్పటికే గడ్డం ప్రసాద్ నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు.
స్పీకర్ పదవికి బుధవారం ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ దాఖలు చేయవచ్చు. బీఆర్ఎస్ కూడా మద్దతు పలకడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. రేపు 14వ తేదీన స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దాదాపు పద్నాలుగువేల ఓట్ల మెజార్టీతో ఆయన ప్రజల మద్దతు కూడగట్టారు.
Also Read: Bigg Boss 7 Finale : బిగ్ బాస్ గ్రాండ్ ఫినల్ కి గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు..?