CM KCR: కేసీఆర్ క్షేమం కోసం మృత్యుంజ‌య హోమం..!

  • Written By:
  • Publish Date - March 14, 2022 / 03:52 PM IST

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ క్షేమం కోసం ఈరోజు మృత్యుంజ‌య హోమం నిర్వ‌హించారు. ఇటీవ‌ల కేసీఆర్ స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌కు గుర‌యిన సంగ‌తి తెలిసిందే. దీంతో కేసీఆర్ అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోవాల‌ని, ఆయ‌న సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ప్రార్థిస్తూ రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ప్రత్యేక యాగం నిర్వహించారు.

ఈ క్ర‌మంలో తన కుటుంబ సభ్యులతో కలిసి మంత్రుల నివాస ప్రాంగణంలో నేడు (మార్చి 14) వేదపండితులతో మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఇక‌ ఇటీవల హఠాత్తుగా కేసిఆర్ అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చికిత్స పొందిన నేపథ్యంలో సంపూర్ణ ఆయురారోగ్యాలతో కొనసాగుతూ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే శక్తి పొందాలని కోరుకుంటూ మృత్యుంజయ హోమం నిర్వహించినట్లు మంత్రి సత్యవతి రాథోడ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

ఇక ఈరోజు సోమవారం ఉదయం 5 గంటలకు ప్రారంభమైన ఈ మృత్యుంజయ హోమం పూర్ణాహుతికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, రాజ్య‌స‌భ‌ ఎంపీలు సంతోష్ కుమార్, మాలోతు క‌విత‌, ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణా రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి , ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, సురభి వాణీ దేవి, తక్కెళ్లపల్లి రవీందర్ త‌దితరులు హాజ‌ర‌య్యి ప్ర‌సాదాలు స్వీక‌రించారు.

ఇక మ‌రోవైపు సీఎం కేసీఈర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తూ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస‌రెడ్డి దంప‌తులు కూడా మృత్యుంజ‌య హోమం నిర్వ‌హించారు. కామారెడ్డి జిల్లాలోని తిమ్మాపూర్‌లోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో ఈ హోమాన్ని జరిపించారు. ఇక‌పోతే మార్చి 11న కేసీఆర్ కేసీఆర్ ఛాతిలో నొప్పి రావడంతో, కుటుంబ స‌భ్యులు ఆయన్ను సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తీసుకెళ్ళి సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కేసీఆర్‌కు ఎలాంటి హార్ట్ ప్రాబ్ల‌మ్స్ లేవ‌ని తెలిపిన‌ య‌శోదా డాక్ట‌ర్లు ,కేసీఆర్ ఓ వారం పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని సూచించారు.