Site icon HashtagU Telugu

Rs 4000 Pension : రూ.4వేల ఆసరా పెన్షన్.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన

Rs 4000 Pension

Rs 4000 Pension

Rs 4000 Pension :  రూ.4వేల ఆసరా పెన్షన్ పంపిణీ ఎప్పటినుంచి ? అనే దానిపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత రూ.4 వేల(Rs 4000 Pension)  ఆసరా పింఛన్ల పంపిణీ మొదలవుతుందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ ముగియగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు. రూ. 2లక్షల రైతు రుణమాఫీ, కొత్త రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ చేపడతామన్నారు. శనివారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ఈ వివరాలను తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join

మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని బీజేపీ చూస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.  కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ, బీజేపీ లోక్‌సభ అభ్యర్థి బండి సంజయ్‌కు ప్రజా సమస్యలు పట్టవని విమర్శించారు. గత ఐదేళ్లలో లోక్‌సభ నియోజకవర్గానికి బండి సంజయ్ ఏమీ చేయలేదని.. ఆయన రాజకీయాల్లో బిజీగా గడిపారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో బండి సంజయ్‌కు కరీంనగర్ ప్రజలు బుద్ధి చెబుతారని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ సర్కారును కూల్చేందుకు బీజేపీ, బీఆర్ఎస్‌లు కుట్ర పన్నాయని పొన్నం ఆరోపించారు.

ఈ నెలలో తెలంగాణలోని ‘ఆసరా’ పింఛనుదారులకు మొదటివారంలోనే పింఛన్లు పడ్డాయి. గతంలో ప్రతినెలా చివరి వారం దాకా పింఛనుదారులు పెన్షన్ డబ్బుల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ఇకపై ఆ పరిస్థితి లేకుండా సర్కారు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటినుంచి ప్రతినెలా మొదటివారంలోనే పెన్షన్ల పంపిణీ జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. భవిష్యత్తులో ప్రతినెలా 1వ తేదీకల్లా దాదాపు 38 లక్షల మంది ఆసరా పెన్షనర్లకు పింఛను పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.  ఆసరా పెన్షన్ల కింద వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, బీడీ వర్కర్స్, ఒంటరి మహిళలకు ఆర్థిక సాయం అందజేస్తున్నారు.

Also Read :Election Effect : ఓటు కోసం సొంతూళ్లకు.. హైదరాబాద్​ – విజయవాడ హైవేపైకి పోటెత్తిన వాహనాలు