TGSRTC : ఆర్టీసీ సిబ్బందికి సమ్మె మార్గాన్ని విడిచిపెట్టాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం మంత్రి పొన్నంను ఐఎన్‌టీయూసీకి చెందిన కార్మిక సంఘాల ప్రతినిధులు కలిసి, సిబ్బంది సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీ ప్రస్తుతం మెల్లమెల్లగా కోలుకుంటోందని, ఇలాంటి సమయంలో సమ్మె చేయడం ప్రజలకు ఇబ్బందులు కలిగించేదిగా ఉంటుందన్నారు. కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.
Read Also: Terrorist Hideout : పంజాబ్‌లో ఉగ్ర కుట్రను భగ్నం చేసిన భద్రతా బలగాలు
ఈ నేపథ్యంలో, ఆర్టీసీ యాజమాన్యం కూడా ఉద్యోగులకు బహిరంగంగా లేఖ రాసి, సమ్మె ఆలోచనను విరమించాలని విజ్ఞప్తి చేసింది. ఆ సంస్థను తల్లిలాగా భావించి, అందరూ కలిసి కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ‘‘సంస్థ అభివృద్ధి మార్గంలోకి వస్తున్న సమయంలో ఇటువంటి ఉద్యమాలు దిశాహీనంగా మారుతాయి. గతంలో 2019లో జరిగిన సమ్మె వల్ల ఆర్టీసీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లింది. అటువంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలి,’’ అని లేఖలో పేర్కొన్నారు.
ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, కార్మిక సంఘాల సూచనల ప్రకారం సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని యాజమాన్యం తెలిపింది. కొంతమంది వ్యక్తులు ప్రయోజనాల కోసం ఉద్యోగుల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, అటువంటి మాటలకు లోనవకుండా ఉద్యోగులు తన బాధ్యతలు నిర్వర్తించాలని సూచించింది. అంతేకాదు, ఆర్టీసీలో సమ్మెలు నిర్వహించడం ఎస్మా చట్టం ప్రకారం నిషిద్ధమని స్పష్టం చేసింది. సమ్మె పేరుతో విధులకు ఆటంకం కలిగించినా, ఇతరులను బెదిరించినా కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.