KTR : చేనేత వస్త్రాలపై ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ ప్రధానికి పోస్ట్ కార్డు రాయాలి..!!

చేనేత కార్మికుల సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చేందుకు లక్షలాదిగా ఉత్తరాలు రాయాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

  • Written By:
  • Publish Date - October 22, 2022 / 08:41 PM IST

చేనేత కార్మికుల సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చేందుకు లక్షలాదిగా ఉత్తరాలు రాయాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీకి ఒక పోస్ట్ కార్డుని రాశారు. చేనేత కార్మికులకు సంబంధించిన పలు సమస్యలను తన పోస్ట్ కార్డులో ప్రస్తావించారు కేటీఆర్. ప్రధానంగా చేనేత వస్త్రాలు, చేనేత ఉత్పత్తులపై ఉన్న 5 శాతం జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తానే స్వయంగా రాసిన ఈ పోస్ట్ కార్డును ప్రధానమంత్రి కార్యాలయానికి పంపనున్నట్లు కేటీఆర్ తెలిపారు.

ఈ సందర్భంగా చేనేత కార్మికులకు సంబంధించిన పలు అంశాలను ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఇప్పటికే చేనేత కార్మికులకు సంబంధించిన సమస్యలను అనేక సందర్భాల్లో వివిధ వేదికల ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లానని చెప్పారు. వాటిపై కేంద్రం నుంచి సానుకూలంగా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత సమస్యలపై సీఎం కేసీఆర్ తో పాటు తాను పలుమార్లు ప్రధానమంత్రికి స్వయంగా ఉత్తరాలు రాసిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. చేనేత కార్మికులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసిన కేంద్రం ఇప్పుడు దేశ చరిత్రలో లేని విధంగా చేనేత ఉత్పత్తుల పై పన్ను విధిస్తుందని విమర్శించారు.

దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న చేనేత రంగంలో కీలకమైన నేత కార్మికులను మానవీయ దృక్పథంతో దేశ సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టే ఒక సాంస్కృతి సారథులుగా పరిగణించి చేనేతపైన వెంటనే పన్నును రద్దు చేయాలని కేటీఆర్ కోరారు. ప్రగతి భవన్ నుంచే చేనేత కార్మికుల పక్షాన పోస్టు కార్డును రాశారు. రాష్ట్రంలో చేనేత కార్మికులు అందరితోపాటు చేనేత కార్మికులు వారి ఉత్పత్తుల పట్ల ప్రేమ కలిగిన ప్రతి ఒక్కరూ ఈ పోస్ట్ కార్డు ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.