KTR: చీమ‌ల‌పాడు బాధితులను పరామర్శించిన మంత్రి కేటీఆర్

ఖమ్మం జిల్లా వైరా నియోజ‌క‌వ‌ర్గంలోని కారేప‌ల్లి మండ‌లం చీమ‌ల‌పాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం వ‌ద్ద జ‌రిగిన‌ అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌పై బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

KTR : ఖమ్మం జిల్లా వైరా నియోజ‌క‌వ‌ర్గంలోని కారేప‌ల్లి మండ‌లం చీమ‌ల‌పాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం వ‌ద్ద జ‌రిగిన‌ అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌పై బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (KTR) దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నలుగురు వ్యక్తులు హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ నిమ్స్ కు వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. మంత్రి కేటీఆర్ (KTR) తో పాటు ఎంపీ నామా నాగేశ్వర రావు ఉన్నారు.

అగ్ని ప్రమాదంలో గాయపడ్డ బాధితుల పరిస్థితిని నిమ్స్ వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు కేటీఆర్. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ప్రాణాపాయం లేదని డాకర్లు మంత్రికి తెలిపారు. కాగా.. వారికీ మెరుగైన ఆరోగ్యం అందించాలని డాక్టర్లకు సూచించారు కేటీఆర్. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ… చీమలపాడులో జరిగిన ఘటన చాలా బాధ కలిగించింది. ప్రమాదంపై దర్యాప్తు జరుగుతుంది. ఘటనలో మరణించిన కుటుంబ సభ్యులకు 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు మంత్రి. అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 10 లక్షలు, గాయపడిన వారికీ 2 లక్షల చొప్పున ప్రభుత్వం నుండి సాయం ప్రకటించారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు కెసిఆర్. గాయపడ్డ వారికీ మెరుగైన వైద్యం అందించాల్సిందిగా నిమ్స్ వైద్యులను ఆదేశించారు. ఇక నామా నాగేశ్వర రావు కూడా ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ముత్తయ్య ట్రస్ట్ ద్వారా చనిపోయిన వారికీ 2 లక్షలు, గాయపడ్డ వారికి 50 వేలు సాయం అందిస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్యే రాములు నాయక్ మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడ్డ బాధితులకు లక్ష రూపాయలు ప్రకటించారు.

ఖమ్మం జిల్లా చీమలపాడు ఏజెన్సీలోని కారేపల్లి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఎంపీ నామా నాగేశ్వర రావు, ఎమ్మెల్యే రాములు నాయక్ వస్తున్నారని బీఆర్ఎస్ కార్యకర్తలు బాణాసంచా కాల్చారు. దీంతో చిన్న నిప్పు రవ్వ కూతవేటు దూరంలో ఉన్న గుడిసెపై పడింది. దాంతో అందులో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా భారీగా మంటలు వ్యాపించాయి. సెకనులో ప్రమాదం తీవ్రతరంగా మారడంతో సభకు వచ్చిన కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Also Read:  KTR: చీమలపాడు అగ్ని ప్రమాద బాధితులకు కేటీఆర్ భరోసా!