తెలంగాణలో వీధి కుక్కల సమస్య (Stray Dogs)పై పురపాలక శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (KVR) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించాలని ఆయన సూచించారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వీధి కుక్కల బెడద తీవ్రమవుతున్న నేపథ్యంలో వాటిని చంపడం సరైన పరిష్కారం కాదని ఆయన అన్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మనుషులతో పాటు కుక్కలకు కూడా విలువ ఇస్తారని, అదే విధంగా మనమూ వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు.
Sakala Janula Samme : సకల జనుల సమ్మెకు 14 ఏళ్లు – KTR
మంత్రి మాట్లాడుతూ “వీధి కుక్కలను చంపాల్సిన అవసరం లేదు. వాటిని చంపితే పాపం మూటగట్టుకున్నట్లే” అని అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి దత్తత తీసుకునే కార్యక్రమాలను ప్రోత్సహించాలని, అందుకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే కుక్కలకు వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ (శుద్ధి) కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ చర్యల ద్వారా వీధి కుక్కల సంఖ్యను నియంత్రించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
వీధి కుక్కల కాటుకు గురికాకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా మంత్రి సూచనలు చేశారు. ఒకవేళ కుక్క కాటుకు గురైతే వెంటనే చేయాల్సిన ప్రథమ చికిత్స, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు ప్రజలకు వివరించాలని తెలిపారు. వీధి కుక్కల సమస్యను సమూలంగా పరిష్కరించడానికి అన్ని వర్గాల ప్రజలు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు సామాజిక కార్యకర్తలు, జంతు ప్రేమికుల నుంచి ప్రశంసలు అందుకున్నాయి.