మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar)కు తృటిలో పెనుప్రమాదం తప్పింది. కరీంనగర్ జిల్లా చర్లభూత్కూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సభావేదికపై మాట్లాడుతుండగా.. వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. గంగులతో పాటు ఇతర నేతలు కిందపడ్డారు. మంత్రికి స్వల్పగాయాలు కాగా ఓ జడ్పీటీసీ సభ్యుడికి కాలు విరగడంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. తనకు చిన్న గాయమే అయిందని విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు మంత్రి గంగుల పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం సహా పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం కరీంనగర్ రూరల్ లోని చెర్లబూట్కూర్ కు మంత్రి హాజరయ్యారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. అయితే అక్కడే ఓ చిన్న సభావేదికను ఏర్పాటు చేశారు. సభావేదిక చిన్నది కావడం ఏకంగా 200 మంది దానిమీదకు వెళ్లడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీనితో మంత్రి గంగుల కమలాకర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. అలాగే జడ్పీటీసీ సభ్యుని కాలు విరగడంతో కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మంత్రి గంగులకు స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందజేశారు.
Also Read: Nenokkadine Re Release: 1 నేనొక్కడినే రీ రిలీజ్ కు సుకుమార్ భార్య ప్లాన్
సీఎం కెసిఆర్ యాగాలు చేస్తే.. ప్రతిపక్షాలు అడ్డు తగులుతున్నాయని, ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కెసిఆర్ సంక్షేమ పథకాల యజ్ఞం చేస్తుంటే ప్రతిపక్షాలు కుట్రలనే రక్తం పోస్తున్నాయన్నారు. పచ్చని తెలంగాణలో చిచ్చు పెట్టేందుకు కుట్రలు చేస్తున్న ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దని అన్నారు. రైతులకు చిన్న ఇబ్బంది కలిగినా సీఎం కేసీఆర్ తట్టుకోలేరని మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు.