Minister Gangula Kamalakar: మిల్లర్లు ప్రభుత్వానికి ఖచ్చితంగా సహకరించాలి.. నష్టపోకుండా చర్యలు తీసుకుంటాం

రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్(Minister Gangula Kamalakar) మిల్ల‌ర్ల అసోసియేష‌న్ ప్ర‌తినిధుల‌తో స‌మావేశం అయ్యారు.

  • Written By:
  • Publish Date - May 25, 2023 / 07:00 PM IST

యాసంగి ధాన్యం సేక‌ర‌ణ‌, సీఎంఆర్ నూక శాతం ఇత‌ర‌త్రా స‌మ‌స్య‌ల‌పై రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్(Minister Gangula Kamalakar) మిల్ల‌ర్ల అసోసియేష‌న్ ప్ర‌తినిధుల‌తో స‌మావేశం అయ్యారు. హైద‌రాబాద్(Hyderabad) లోని డా. బి.ఆర్‌. అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో ఈ స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మిల్ల‌ర్ల అసోసియేష‌న్ ప్ర‌తినిధుల‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు. తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంత‌రం ప‌నిచేస్తుంద‌ని అన్నారు. దేశంలో ఎక్క‌డాలేని విధంగా క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌తో ధాన్యం సేక‌ర‌ణ చేయ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం అని చెప్పారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ రైతుల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌ల‌కుండా మిల్ల‌ర్లు ప్ర‌భుత్వానికి ఖ‌చ్చితంగా స‌హ‌క‌రించాల‌ని మంత్రి గంగుల కోరారు.

ఎఫ్.ఏ.క్యూ ధాన్యంలో ఒక్క గింజ కోత పెట్టినా ఉపేక్షించమన్న మంత్రి, ధాన్యం అన్ లోడింగ్ వెంట వెంటనే చేపట్టాల‌ని మిల్ల‌ర్ల‌కు సూచించారు. సీఎంఆర్ నిర్ణీత గ‌డువులోగా ముగించాల‌ని అన్నారు. యాసంగి ధాన్యంలో నూక‌శాతంపై గ‌తంలో నిపునుల క‌మిటీ మ‌ధ్యంత‌ర నివేదిక స‌మ‌ర్పించిన నేప‌థ్య‌లో ప్ర‌స్తుత యాసంగి వ‌రి ర‌కాలు, ప‌రిస్థితుల‌కు ఎలా అన్వ‌యించాలో త్వ‌ర‌లోనే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నిర్ణ‌యిస్తామ‌ని మంత్రి చెప్పారు. ప్ర‌భుత్వంకు మిల్ల‌ర్లు అన్నివిధాల స‌హ‌క‌రించాల‌ని, త‌ద్వారా ప్ర‌భుత్వంతో పాటు మిల్ల‌ర్లు న‌ష్ట‌పోకుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మంత్రి గంగుల మిల్ల‌ర్ల‌కు హామీ ఇచ్చారు.

మిల్ల‌ర్ల అసోసియేష‌న్ ప్ర‌తినిధులు మంత్రి గంగుల దృష్టికి తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను తెచ్చారు. త‌మ‌ను రైతుల‌కు శ‌తృవులుగా ప్ర‌చారం చేయ‌డం బాధ క‌లిగిస్తుంద‌ని అన్నారు. ఎఫ్.ఏ.క్యూతో ఉన్న ధాన్యంలో కోత‌లు పెట్ట‌డం లేద‌ని చెప్పారు. అయితే.. ప్ర‌భుత్వం త్వ‌రిత‌గ‌తిన నూక‌శాతాన్ని తేల్చాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. అదేవిధంగా తెలంగాణ‌లో యాసంగి ఉష్ణోగ్ర‌త‌ల‌కు పొట్ట‌ద‌శ‌లోనే గింజ విరిగిపోతుంద‌ని, దీన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేనివిధంగా కేంద్ర ప్ర‌భుత్వం యాసంగిలో ముడి బియ్యాన్ని ఇవ్వ‌మ‌ని కోర‌డం వ‌ల్ల రైతుల‌తో పాటు మిల్లింగ్ ఇండ‌స్ట్రీ ఇబ్బందులు పాల‌వుతుంద‌ని, ఈ నిర్ణ‌యంపై పున‌రాలోచ‌న చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేయాలనీ కోరారు.

 

Also Read : MLA Vivekananda: కేటీఆర్ ఒత్తిడి చేశారనే వ్యాఖ్యల్లో వాస్తవం లేదు.. రేవంత్‌, ర‌ఘునంద‌న్‌పై ఫైర్‌