Mini Medaram : తెలంగాణలో మాత్రమే కాకుండా ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రఖ్యాతి గాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర భక్తుల విశ్వాసానికి చిరునామాగా నిలుస్తోంది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ మహా జాతరకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. హిందువుల కుంభమేళాకు సమానమైన గుర్తింపు పొందిన మేడారం జాతరకు కోట్లాది మంది భక్తులు విచ్చేసి దేవతలను పూజిస్తూ, మొక్కులు చెల్లిస్తుంటారు.
అయితే ప్రధాన మేడారం జాతర మధ్యలో, ప్రతి రెండేళ్లకోసారి మినీ మేడారం జాతర నిర్వహించే సంప్రదాయం కూడా ఇటీవల ప్రారంభమైంది. ఇదే క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 12 నుంచి 15వ తేదీ వరకు ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ మినీ జాతర జరగనుంది. ఈ మినీ జాతరకు భారీగా భక్తులు హాజరవుతారని భావిస్తూ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈసారి మినీ మేడారం జాతరకు సుమారు 2 నుంచి 3 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తోంది.
Delhi Election Results : ఢిల్లీ ప్రజలు సరైన సమయంలో సరైన పార్టీని ఎన్నుకున్నారు : చంద్రబాబు
భక్తుల రవాణ కోసం ప్రత్యేక బస్సు సర్వీసులు
భక్తుల రాకపోకలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మినీ మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను నడుపుతామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
ఎన్ని బస్సులు నడుస్తాయంటే?
ఫిబ్రవరి 9న – 15 బస్సులు
ఫిబ్రవరి 10న – 10 బస్సులు
ఫిబ్రవరి 11న – 10 బస్సులు
ఫిబ్రవరి 12న – 20 బస్సులు
ఫిబ్రవరి 13న – 25 బస్సులు
ఫిబ్రవరి 14న – 50 బస్సులు
ఫిబ్రవరి 15న – 20 బస్సులు
ఫిబ్రవరి 16న – 50 బస్సులు
మొత్తంగా 200 బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. మొత్తం 400 ట్రిప్పులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు.
ప్రతి రోజూ భక్తుల రద్దీని అంచనా వేసి హన్మకొండ బస్ స్టేషన్ నుంచి మేడారం వరకు ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ బస్సులు ఉదయం 6:00 గంటల నుంచి ప్రారంభమవుతాయి. భక్తుల రద్దీని అనుసరించి అవసరమైన మేరకు బస్సుల సంఖ్య పెంచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యం
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు సర్వీసులు మినీ మేడారం జాతరకు కూడా వర్తిస్తాయని అధికారులు తెలిపారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. మహిళలు తమ ఆధార్ కార్డు చూపించడం ద్వారా ఈ సేవలను వినియోగించుకోవచ్చు.
మినీ మేడారం జాతరకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులే కాకుండా సూపర్ లగ్జరీ, రాజధాని బస్సులు కూడా అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ బస్సుల్లో ప్రయాణించాలంటే ముందుగా ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుందని ఆర్టీసీ అధికారులు సూచించారు.
జాతరకు ముందుగా పూజా కార్యక్రమాలు ప్రారంభం
మినీ మేడారం జాతర ప్రారంభానికి ముందే గిరిజన పూజారులు మండెమెలిగే కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఆలయ పరిసరాలను శుభ్రం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో భక్తులు సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు భారీగా తరలి వచ్చే అవకాశముంది.
ఈసారి మినీ మేడారం జాతరకు భారీ భక్తుల రద్దీ ఉండే అవకాశముండడంతో ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, తాత్కాలిక నివాస వసతులు వంటి అన్ని అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ప్రకటించింది. భక్తుల సందడితో మేడారం మరికొన్ని రోజుల్లో ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది.