Akbaruddin Owaisi : ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ ఒకటే. అదే ‘హైడ్రా’ కూల్చివేతలు. హైడ్రా తీసుకుంటున్న చర్యలతో రాజకీయ కలకలం రేగుతోంది. ఈనేపథ్యంలో హైదరాబాద్‌లోని బండ్లగూడలో ఉన్న ఫాతిమా ఒవైసీ ఉమెన్స్ కాలేజీని కూడా కూల్చేయాలంటూ హైడ్రాకు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. ఓల్డ్ సిటీలో ఉన్న సల్కం చెరువును కబ్జా చేసి ఆ కాలేజీని కట్టారంటూ ఫిర్యాదుల్లో పేర్కొన్నట్లు సమాచారం. అయితే దీనిపై హైడ్రా అధికార వర్గాలు ఇంకా విచారణ జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈక్రమంలోనే ఇవాళ ఉదయం హైడ్రాకు చెందిన ఉన్నతాధికారులు స్వయంగా వెళ్లి సల్కం చెరువును పరిశీలించినట్లు తెలిసింది. దీంతో మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి(Akbaruddin Owaisi) చెందిన ఫాతిమా ఒవైసీ ఉమెన్స్ కాలేజీని కూడా కూల్చివేస్తారనే ప్రచారం మొదలైంది. అయితే దీనిపై ఇప్పటివరకైతే ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
We’re now on WhatsApp. Click to Join
ఓల్డ్ సిటీలో ఉన్న సల్కం చెరువు ఇప్పటికే దాదాపు 70 శాతం కబ్జాకు గురైందని హైడ్రా అధికారులు తేల్చారు. ఆ చెరువును మట్టితో పూడ్చేసి.. అలా పూడ్చేసిన స్థలాల్లో భారీ భవనాలను కట్టారని వెల్లడైంది. 2016 నుంచి 2021 సంవత్సరం మధ్యకాలంలో ఈ చెరువు భారీగా కబ్జాలకు గురైందని విచారణలో తేలినట్లు సమాచారం. ఈమేరకు వివరాలతో హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. తదుపరిగా హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు ఎక్కడ జరగబోతున్నాయనే దానిపైనే అంతటా చర్చ జరుగుతోంది.
నెక్ట్స్ కూల్చివేతలు సల్కం చెరువు ప్రాంతంలోనే ఉంటాయని కొందరు అంచనా వేస్తున్నారు. కూల్చివేతల క్రమంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా అదుపులోకి తెచ్చేందుకు అదనపు బలగాలను కూడా రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గత మూడు రోజులుగా హైడ్రా కార్యాలయంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. తదుపరిగా హైడ్రా చేపట్టబోయే కూల్చివేత చర్యలపై ఈ మీటింగ్‌లలో ఒక క్లారిటీకి వచ్చి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.