‘మిల్లెట్ మ్యాన్’గా తెలుగు ప్రజలకు సుపరిచితమైన పీవీ సతీశ్ (Millet Man PV Satheesh) కన్నుమూశారు.మిల్లెట్ మ్యాన్ పివి సతీష్ (77) తుది శ్వాస విడిచారు. కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న పీవీ సతీష్ చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సేంద్రియ వ్యవసాయం, చిరు ధాన్యాల సాగు కోసం 4 దశాబ్దాలుగా చేసిన కృషికి మిల్లెట్ మ్యాన్‌గా గుర్తింపు పొందారు.
అయితే 1945 జూన్ 18న కర్ణాటకలో జన్మించిన పీవీ సతీష్ హైదరాబాద్‌లోని దూరదర్శన్‌లో డైరెక్టర్‌గా పనిచేశారు. ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ పూర్తి చేసిన సతీశ్.. 20 సంవత్సరాలపాటు దూరదర్శన్‌లో కార్యక్రమ ప్రధాన నిర్వాహకుడిగా పనిచేశారు. 1970లో నాసా, ఇస్రో కలిసి నిర్వహించిన ‘శాటిలైట్ ఇన్‌స్ట్రక్షనల్ టెలివిజన్’ (సైట్) ప్రయోగంలో ముఖ్య పాత్ర పోషించారు. తర్వాత సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీని స్థాపించారు. జహీరాబాద్ ప్రాంతంలో దళిత మహిళల సాధికారత కోసం పీవీ సతీష్ కుమార్ విశేష కృషి చేశారు. అలాగే వాతావరణ మార్పుల నేపథ్యంలో రసాయనిక ఎరువులు, పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించి రైతుల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించారు.
Also Read: Salman Khan Gets Threat Mail: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపు ఈ-మెయిల్
అంతేకాకుండా.. హైదరాబాద్-ముంబై జాతీయ రహదారిపై తొలి మిల్లెట్స్ కేఫ్‌ను ఏర్పాటు చేసేందుకు తనవంతు కృషి చేశారు. 30 ఏళ్ల కిందటే తొలిసారిగా చిరు ధాన్యాలను ప్రపంచ చర్చల్లో ప్రవేశపెట్టడంలో విజయం సాధించారు. సేంద్రియ వ్యవసాయం, చిరు ధాన్యాల సాగు కోసం 4 దశాబ్దాల పాటు శ్రమించారు. ముఖ్యంగా చిన్న కమతాల్లో పెట్టుబడి లేకుండా చిరు ధాన్యం పంటల సాగు, విస్తీర్ణం, వినియోగం పెంచేందుకు కృషి చేశారు. ప్రభుత్వ పంపిణీ వ్యవస్థలో చిరుధాన్యాన్ని చేర్చడంలో కీలకపాత్ర పోషించారు. ఆయన చేసిన కృషికి గాను ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. అలాగే సతీష్ మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. సోమవారం జహీరాబాద్‌లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.