మునుగోడు ఉప ఎన్నిక ముగింట రాష్ట్ర రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. టీఆర్ఎస్ నేతలు బీజేపీలోకి.. బీజేపీ నేతలు టీఆర్ఎస్ లోకి జంపింగ్ చేస్తూ రాజకీయాన్ని రసవత్తరంగా మారుస్తున్నారు. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపిన బీజేపీ, టీఆర్ ఎస్ నేతలను తమ పార్టీలోకి చేర్చుకొని అధికార పార్టీకి సవాల్ విసురుతోంది. ఈటల రాజేందర్ దూకుడు పెంచడంతో చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకటరెడ్డి, మాజీ జెడ్పిటీసీ బుచ్చిరెడ్డి బీజేపీలో చేరారు. ప్రజారాజ్యం, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలో చాలా కాలం పని చేసిన తాడూరి వెంకట్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నిక టికెట్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఇవ్వొద్దంటూ మొన్నటిదాకా అసమ్మతి నేతలను కూడగట్టారు.
అయితే తాడూరి వెంకట్ రెడ్డి, బుచ్చిరెడ్డిలపై టీఆర్ఎస్ హైకమాండ్ సస్పెన్షన్ వేటుకు సిద్ధమైన నేపధ్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను కలిసినందుకు అధికార కేసీఆర్ ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేసేందుకు ప్రయత్నించిందని చౌటుప్పల్ టీఆర్‌ఎస్ ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి మంగళవారం ఆరోపించారు. సోమవారం రాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు తన నివాసానికి వచ్చి మెయిన్ డోర్ తెరవాలని కోరారని ఎంపీపీ పేర్కొన్నారు. అయితే ఆయన కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే ఈ ఇష్యూ జరిగిన కొద్ది గంటల్లోనే చౌటుప్పల్ నేతలు బీజేపీలో చేరడం గమనార్హం.