Megastar Chiranjeevi: తెలంగాణలో లోకసభ ఎన్నికల పోరు తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా చేవెళ్ల లోక్ సభ స్థానంలో పోరు రసవత్తరంగా మారింది. ఈ స్థానం నుంచి 2014లో టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి గెలిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే కొన్ని పరిస్థితుల కారణంగా ఆయన బీజేపీలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈసారి బీజేపీ పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తున్నారు.
కొండాను ఎలాగైనా ఓడించి తీరాలనే పట్టుదలతో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ అందుకు తగ్గ వ్యూహాలను అనుసరిస్తుంది. ఈ క్రమంలో చేవేళ్ల స్థానంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల వ్యూహ ప్రతివ్యూహాలతో పోటీ నువ్వా, నేనా అన్నట్లుగా మారింది. దీంతో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి బలాబలాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన మెగాస్టార్ చిరంజీవి మద్దతుని కూడగట్టుకున్నారు. అటు మెగాస్టార్ కూడా కొండా అభ్యర్థిత్వాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా చిరంజీవి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
చేవెళ్ల లోకసభ స్థానంలో భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని చిరంజీవి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎక్స్ ద్వారా చిరు కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఎంతో కాలంగా నా స్నేహితుడు. నా కోడలు ఉపాసన ద్వారా దగ్గరి బంధువు కూడా. ఆయన సౌమ్యుడు, ఉత్తముడు. అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. ఇలాంటి వ్యక్తి రాజకీయంగా ముందుకువచ్చి సమాజానికి సేవలు అందించడం ఎంతైనా అవసరం. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినవారు. విద్యాధికుడు. ప్రజాసేవ, చేవెళ్ల ప్రాంత అభివృద్ధే లక్ష్యంగా భాజపా తరఫున బరిలో ఉన్నారు. గతంలో ఆయన చేసిన అభివృద్ధి మీకు తెలుసు. ఈ సందర్భంగా చేవెళ్ల ఓటర్లకు నా విజ్ఞప్తి. విలువైన ఓటును ఆయనకు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని వీడియోలో చిరంజీవి కోరారు.
Also Read: Allu Arjun : అల్లు అర్జున్ నంద్యాల పర్యటన.. వైసీపీపై చంద్రబాబు విమర్శలు..