KCR: ప్రజలను కలుస్తూ, కష్టాలను తెలుసుకుంటూ.. పదమూడో రోజు కేసీఆర్ బస్సు యాత్ర విశేషాలు

KCR: ఆదివారం జగిత్యాలలో బస చేసిన కేసీఆర్, బస్సు యాత్ర ద్వారా సోమవారం నిజామాబాద్ దిశగా సాగారు. పదుల సంఖ్యలో వాహనాలు, వందలాదిగా నాయకులు కార్యకర్తలతో కూడిన కేసీఆర్ బస్సు యాత్ర కాన్వాయ్.. తోవలో ప్రజలను కలుస్తూ వారి కష్టాలను దుఃఖాలను సమస్యలను తెలుసుకుంటూ వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతోంది. జగిత్యాల లో బస చేసిన కేసీఆర్, స్థానింకంగా నివాసం ఉంటున్న తన చిన్న నాటి గురువు ప్రముఖ కవి జైశెట్టి రమణయ్య గారి వద్దకు […]

Published By: HashtagU Telugu Desk
Kcr Road Show

Kcr Road Show

KCR: ఆదివారం జగిత్యాలలో బస చేసిన కేసీఆర్, బస్సు యాత్ర ద్వారా సోమవారం నిజామాబాద్ దిశగా సాగారు. పదుల సంఖ్యలో వాహనాలు, వందలాదిగా నాయకులు కార్యకర్తలతో కూడిన కేసీఆర్ బస్సు యాత్ర కాన్వాయ్.. తోవలో ప్రజలను కలుస్తూ వారి కష్టాలను దుఃఖాలను సమస్యలను తెలుసుకుంటూ వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతోంది.

జగిత్యాల లో బస చేసిన కేసీఆర్, స్థానింకంగా నివాసం ఉంటున్న తన చిన్న నాటి గురువు ప్రముఖ కవి జైశెట్టి రమణయ్య గారి వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. వయోభారం తో అనారోగ్యం తో విశ్రాంతి తీసుకుంటున్న వారిని కేసీఆర్ పరామర్శించారు. రమణయ్య గారి కుటుంబ సభ్యులు కేసీఆర్ ను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తాను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో సిద్దిపేట జూనియర్ కాలేజీలో హిస్టరీ లెక్చరర్ గా తనకు చరిత్ర పాఠాలు నేర్పిన నాటి జ్ఞాపకాలను కేసీఆర్ నెమరువేసుకున్నారు.

ఇంతింతై వటుడింతయ్ అన్నట్టు గా ఎదిగిన తన ప్రియ శిష్యుణ్ణి చూసిన గురువు రమణయ్య గారు ఎంతగానో సంబురపడ్డారు. తెలంగాణ ప్రజల పట్ల ఆనాటి నుంచి కేసీఆర్ కున్న శ్రద్ధ ను ఈ సందర్భంగా ఆ పెద్దమనిషి ప్రస్తావించారు. సిద్దిపేట జిల్లా కావాలని 30 ఏండ్లకిందనే కేసీఆర్ నాటి కేంద్ర మంత్రికి వినతిని అందించిన విషయాన్ని గురువు రమణయ్య గుర్తుచేశారు. ప్రజలను చైతన్యం చేసి ఉద్యమానికి నాయకత్వం వహించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత నీదేనని తన శిష్యుడు కేసీఆర్ ను కొనియాడారు రమణయ్య.

సాధించిన రాష్ట్రాన్ని అనతికాలంలోనే అభివృద్ధి చేసి తెలంగాణ ఔన్నత్యాన్ని దేశంలో నిలిపావని మెచ్చుకున్నారు. కష్టాలను నష్టాలను సుఖాలను బాధలను జయాలను అపజయాలను సమ స్థితిలో స్వీకరించడం కేసీఆర్ కు చిన్ననాటినుండీ అలవాటేనని అదే ఆయన విజయాలకు మూలమని, అదే స్థితప్రజ్ఞతను కొనసాగిస్తూ భవిష్యత్తులో విజయాలు సాధిస్తూ తెలంగాణ ప్రజల కన్నీళ్లు తూడ్చడంలో ముందుండాలని,తెలంగాణ ప్రజల సంక్షేమానికి ఇంకా చాలా చేయాల్సి ఉన్నదని తన శిష్యునికి రమణయ్య ఉద్భోదించారు.

తనను పరామర్శించడానికి వచ్చిన శిష్యుడు కేసీఆర్ తో పావుగంట పాటు ఇష్టాగోష్టి కొనసాగించారు. అనంతరం గురువు వద్ద మరోసారి ఆశీర్వాదం వీడ్కోలు తీసుకుని తన పదమూడో రోజు బస్సు యాత్రను కొనసాగించేందుకు కేసీఆర్ ముందుకు కదిలారు. బస్సు యాత్ర నిజామాబాద్ దిశగా కొనసాగుతోంది.

  Last Updated: 06 May 2024, 06:01 PM IST