Mee Seva App : 150 రకాల పౌరసేవలతో ‘మీసేవ’ మొబైల్ యాప్‌ను తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఆవిష్కరించనుంది. దీని ద్వారా ప్రజలు ఇంటి నుంచే చాలా రకాల పౌరసేవలను పొందొచ్చు. దీంతోపాటు రాష్ట్రంలోని షాపింగ్‌మాల్స్, మెట్రో స్టేషన్లు, సమీకృత కలెక్టరేట్ల వంటి రద్దీప్రాంతాల్లో ఇంటరాక్టివ్ మీసేవ కియోస్క్‌లను ఏర్పాటు చేస్తారు. ప్రజలు వాటి ద్వారా కూడా పౌరసేవలను పొందొచ్చు. ఈ కియోస్క్‌లలో వివిధ మీసేవలకు సంబంధించిన దరఖాస్తులను నింపడం, పేమెంట్స్ చేయడం, సర్టిఫికెట్ ప్రింట్ తీసుకోవడం వంటివి చేయొచ్చు. మీసేవ(Mee Seva App) మొబైల్ యాప్‌లో కొన్ని కొత్త సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. పర్యాటక శాఖ హోటల్స్, పర్యాటక ప్యాకేజీల బుకింగ్, దివ్యాంగుల గుర్తింపుకార్డులు, వయోవృద్ధుల సంక్షేమ కేసుల పర్యవేక్షణ, సదరం సర్టిఫికెట్ల జారీ, వన్యప్రాణుల బాధితులకు సహాయం, టింబర్ డిపోలు, కలప మిల్లుల పర్మిట్ల పునరుద్ధరణ, కొత్త పర్మిట్ల జారీ, వాల్టా చట్టం కింద చెట్ల తొలగింపు, చెట్ల తరలింపు అనుమతులు వంటి సర్వీసులు కూడా యాప్‌లో ఉన్నాయి.
Also Read :Syrian Rebels: సిరియాలో ఉద్రిక్తత పరిస్థితులు.. దేశం విడిచి పారిపోయిన అధ్యక్షుడు?
కేంద్ర ప్రభుత్వ స్కీం ‘భారత్ నెట్’ ద్వారా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ ఇంటర్నెట్‌ను అందించనున్నారు. ఈ కనెక్షన్ కోసం కేవలం రూ.300 తీసుకుంటారని తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక స్కీం అమలును ఇవాళే సీఎం రేవంత్ ప్రారంభిస్తారు. ఈ స్కీంను తెలంగాణలో ‘టీఫైబర్’ విభాగం అమలు చేయనుంది. తొలుత దీన్ని రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో ఉన్న ఒక్కో గ్రామంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తారు. 4వేల కుటుంబాలకు కేబుల్‌టీవీ సేవలతో కూడిన బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు అందిస్తారు. పెద్దపల్లిలోని అడవి శ్రీరాంపూర్, సంగారెడ్డిలో సంగుపేట, నారాయణపేటలోని మద్దూర్‌లో భారత్ నెట్ సేవలు రానున్నాయి. ఈసందర్భంగా భారత్ నెట్ కనెక్షన్ పొందిన పలువురితో సీఎం రేవంత్ స్వయంగా మాట్లాడనున్నారు.