హైదరాబాద్‌లోని బోయినపల్లి శ్రీమేధా స్కూల్ (Medha School ) వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం ఆందోళనకు దిగారు. ఆదివారం అల్ప్రాజోలం తయారీ కేసులో ఈ పాఠశాలను అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే స్కూల్ మూతపడిందని ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో చెప్పాలని, వెంటనే ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్లు (TCs) ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే 70 శాతం ఫీజులు చెల్లించామని, ఈ పరిస్థితుల్లో విద్యాశాఖ తక్షణం ప్రత్యామ్నాయ మార్గం చూపాలని కోరారు.
International School Leaders’ Summit 2025 : పాశ్చాత్య దేశాల వైపు చూడటం మానుకోవాలి – ఎంపీ యదువీర్
దర్యాప్తులో స్కూల్ యజమాని మలేలా జయప్రకాశ్‌గౌడ్ పదినెలలుగా పాఠశాలలోనే అల్ప్రాజోలం డ్రగ్ తయారు చేస్తున్నట్టు బయటపడింది. జయప్రకాశ్ తన బైక్ మీద డ్రగ్స్‌ను సరఫరా చేస్తూ, పాఠశాల నడుస్తున్న సమయంలో రెండు గదులకు తాళం వేసి ఉంచి అక్కడ తయారీ కొనసాగించేవాడని పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో శేఖర్, గురవారెడ్డి, మురళీసాయి, ఉదయ్‌సాయి సహకారం ఉన్నట్టు ఈగల్ టీమ్ అధికారులు తెలిపారు. గురవారెడ్డి ఇచ్చిన ఫార్ములాతోనే జయప్రకాశ్ స్కూల్‌లో డ్రగ్ యూనిట్ ఏర్పాటు చేసినట్టు తేలింది.
దర్యాప్తు సందర్భంగా పోలీసులు స్కూల్ నుంచి రూ.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. జయప్రకాశ్ ఈ మొత్తాన్ని ఫ్యాక్టరీలో పాత పేపర్ల మధ్య దాచినట్టు అధికారులు వెల్లడించారు. మహబూబ్‌నగర్, సంగారెడ్డికి కూడా డ్రగ్స్ సరఫరా చేసిన సాక్ష్యాలు దొరికాయి. ఈ ఘటనపై విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకుంటూ మేధా స్కూల్ లైసెన్స్‌ను రద్దు చేసి, పూర్తిగా సీజ్ చేసింది. ప్రస్తుతం స్కూల్‌లో చదువుతున్న 130 మంది విద్యార్థులను ఇతర పాఠశాలలో చేర్పించే ప్రక్రియను మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా డీఈవో విజయకుమారి పర్యవేక్షిస్తున్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇస్తున్నారు.