ఏపీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలోని టీఆర్ఎస్, వైఎస్సాఆర్టీపీకి రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరించనున్నాడు. తెలుగు రాష్ట్రాలపై ఆయన ముద్ర ప్రత్యేకంగా పడింది. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడానికి ఆయన రచించిన ఎత్తుగడలు ఇప్పుడు కేసీఆర్ ను ఆకట్టుకున్నాయి. మూడోసారి సీఎం కావడానికి పీకే వ్యూహాలపై కేసీఆర్ ఆధారపడ్డాడు. ప్రాథమిక సర్వే నివేదికలు అధ్యయనం చేసిన తరువాత పీకేను పూర్తి స్థాయి రాజకీయ వ్యూహకర్తగా నియమించుకోవాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆ విషయాన్ని సోమవారం మంత్రులు, అధికారులతో సమావేశమైన కేసీఆర్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చే అవకాశం ఉంది.ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ ఫౌండర్. ఆ సంస్థ ద్వారా తొలుత 2014 ఎన్నికల్లో బీజేపీ తరపున రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించాడు. ఛాయ్ పే చర్చ ద్వారా మోడీని హైలెట్ చేసిన గుర్తింపు ఉంది. అప్పటికే 10 ఏళ్ల యూపీఏ ప్రభుత్వం కుంభకోణాలపై విసిగిపోయిన జనం మోడీ పక్షాన నిలిచారు. ఫలితంగా ప్రశాంత్ కిషోర్ వ్యూహాలకు తొలిసారి ప్రాధాన్యం పెరిగింది. ఆ తరువాత 2017 యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించినప్పటికీ బోల్తా పడ్డాడు. పేట్ పే చర్చ అంటూ రాహుల్ చేత చేయించిన పీకే ఘోరంగా వైఫల్యం చెందాడు. బీహార్ ఎన్నికల్లో నితీష్, లాలూను ఒక చోటకు చేర్చడం ద్వారా అప్పట్లో కొంత మేరకు సక్సెస్ అయ్యాడు. కానీ, నితీష్ జాతీయ రాజకీయ జీవితాన్ని శాశ్వతంగా సమాధి చేశాడు. ప్రస్తుతం బీజేపీ దయాదాక్షిణ్యాలపై బీహార్ సీఎంగా నితీష్ ఉన్నాడు.
ఇటీవల జరిగిన బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీకి రాజకీయ వ్యూహకర్తగా పీకే వ్యవహరించాడు. పలు జిమ్మిక్కులతో మమతను సీఎం చేయగలిగాడు. కానీ, ఆమె మాత్రం ఓడిపోయింది. బెంగాల్ మొత్తంలో టీఎంసీని అధికారంలోకి తీసుకురాగలిగిన పీకే వ్యూహం మమతను ఎమ్మెల్యేగా గెలిపించలేకపోయింది. బెంగాల్ ఫలితాల క్రేజ్ తో జాతీయ రాజకీయాలను మార్చాలని ఆయన వ్యూహాలను రచించాడు. ఆ మేరకు మమతను కాబోయే ప్రధానిగా ఫోకస్ చేశాడు. తొలి ప్రయత్నంలోనే కాంగ్రెస్, బీజేయేతర ఫ్రంట్ వ్యూహం ముంబైలో బెడిసి కొట్టింది. యూపీఏ లేదనే విషయాన్ని పీకే ఫోకస్ చేసినప్పటికీ దాని మనుగడ ఉందని ఎన్సీపీ నేత శరద్ పవార్, స్టాలిన్ తదితరులు వాయిస్ వినిపించారు. దీంతో వ్యూహాన్ని మార్చేసుకున్నాడు. కాంగ్రెస్‌తో కూడిన కూటమి దిశగా అడుగు వేస్తున్నాడు.తాజా రాజకీయ వ్యూహాన్ని కేసీఆర్ ద్వారా ఫోకస్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అందుకే, రాహుల్ గాంధీకి అండగా ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ నిలిచాడు. పలు అంశాల్లో బీజేపీని వ్యతిరేకిస్తోన్న కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర అయ్యేలా స్టేట్ మెంట్లు ఇస్తున్నాడు. ఇవన్నీ పీకే ఇచ్చిన రాజకీయ వ్యూహం ప్రకారం జరుగుతున్నాయని రాజకీయ వర్గాల భావన. పైగా ఫాం హౌస్ లో ఏకాంతంగా పీకే, కేసీఆర్ భేటీ కూడా దాన్ని ద్రువీకరిస్తోంది. ప్రస్తుతం జగన్, మమత కు రాజకీయ వ్యూహాలను పీకే అందిస్తున్నాడు. జాతీయ స్థాయిలో ఫ్రంట్ దిశగా ప్లాన్ చేస్తోన్న ఆయన తాజాగా కేసీఆర్ ను కూడా ఆకట్టుకున్నాడు. మూడోసారి సీఎం కావడానికి అవసరమైన ప్రణాళికను కేసీఆర్ ముందుంచాడని తెలుస్తోంది. ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాల తీరుపై కూడా ఒక ప్రజెంటేషన్ ఇచ్చినట్టు సమాచారం. దాన్ని బేస్ చేసుకుని కేసీఆర్ అడుగులు వేగంగా పడనున్నాయని తెలుస్తోంది. అవసరమైతే, ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి కూడా సిద్ధం అవుతున్నట్టు గులాబీ గూటిలో వినిపిస్తోన్న మాట.
మొత్తం మీద తెలుగు రాష్ట్రాలపై ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాల ముద్ర పడనుంది. 2019 ఎన్నికల్లో జగన్ కోడికత్తి కేసు చాలా ప్రభావం చూసింది. బెంగాల్ ఎన్నికల్లో మమత కాలు ప్రమాదం ప్రభావం చూశాం. ఇక తెలంగాణ ఎన్నికల్లో రాజకీయ వ్యూహకర్తగా బాధ్యతలు తీసుకోబోతున్న పీకే ఎలాంటి ప్రమాదాన్ని సృష్టిస్తాడో..చూడాలంటూ అప్పుడే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఐ ప్యాక్ టీం ఇప్పుడు షర్మిల కు కూడా పనిచేస్తోంది. పీకే సూచనలు సలహాల మేరకు లోటస్ పాండ్ లో ఐ ప్యాక్ మద్ధతు ఇస్తోంది. ఇప్పుడు మళ్లీ కేసీఆర్ పక్షాన పీకే చేరాడు. అటు జగన్, ఇటు షర్మిల, కేసీఆర్ ల మధ్య పీకే ఎలాంటి వ్యూహాలను తెరమీదకు తీసుకొస్తాడో..ఆసక్తికరం.