Site icon HashtagU Telugu

Eturnagaram Encounter : ఏటూరునాగారం అడవుల్లో ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం

Maoists Encounter in Eturnagaram

Eturnagaram Encounter : ఒక్కసారిగా ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం పరిధిలో ఉన్న చల్పాక అటవీ ప్రాంతం కాల్పుల మోతతో మార్మోగింది. భారీ ఎన్‌కౌంటర్‌లో  ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు ఉన్నారని తెలుస్తోంది.  తెలంగాణ గ్రేహౌండ్స్‌, యాంటీ మావోయిస్ట్‌ స్క్వాడ్‌ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. మావోయిస్టుల కదలికలపై విశ్వసనీయ సమాచారం అందుకున్న అనంతరం భద్రతా బలగాలు అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి.

Also Read :Vijay Sethupathi : చైనాలో విజయ్ సేతుపతి మహారాజా కలెక్షన్ల దూకుడు..!

ఈక్రమంలో మావోయిస్టులు(Eturnagaram Encounter) తారసపడిన అనంతరం కాల్పులు, ప్రతికాల్పులతో అటవీ ప్రాంతం దద్దరిల్లింది. భద్రతా బలగాల ప్రతికాల్పుల్లో ఏడుగురు  మావోయిస్టులు చనిపోయారు. చనిపోయిన వారిలో ఇల్లందు, నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి బద్రు అలియాస్ పాపన్న ఉన్నట్లు తెలిసింది. ఇల్లందు, నర్సంపేట ఏరియా కమిటీలోని పలువురు దళ సభ్యులు కూడా చనిపోయిన వారిలో ఉన్నట్లు సమాచారం. చనిపోయిన మావోయిస్టులలో  కురుసం మంగు అలియాస్‌ భద్రు అలియాస్‌ పాపన్న (35), ఎగోలపు మల్లయ్య అలియాస్‌ మధు(43), ముస్సకి దేవల్‌ అలియాస్‌ కరుణాకర్‌(22), ముస్సకి జమున (23), జైసింగ్‌ (25), కిశోర్‌ (22), కామేశ్‌( 23) ఉన్నారని తెలిసింది. అయితే ఈ వివరాలను పోలీసుశాఖ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఘటనా స్థలంలో రెండు ఏకే 47 రైఫిల్స్‌, వివిధ  ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read :Pawan Kalyan OG : పవర్ స్టార్ OGలో మరో స్టార్ హీరో..?

14 ఏళ్ల తర్వాత ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో జరిగిన అతిపెద్ద ఎన్‌కౌంటర్‌ ఇదే.  తెలంగాణ పొరుగునే ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాలు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలలో గత ఏడాది కాలంలో పెద్దసంఖ్యలో ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఆ ఘటనల్లో పెద్దసంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలను కోల్పోయారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలలో ప్రతికూల పరిస్థితులు ఉన్నందున అక్కడి మన్యం ప్రాంతాల నుంచి చాలామంది మావోయిస్టులు తెలంగాణలోని అడవుల్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. దీనిపై తెలంగాణ పోలీసు విభాగానికి నిఘా వర్గాల సమాచారం అందింది. దాని ప్రకారమే.. సరైన లొకేషన్‌ను గుర్తించి ఈ ఎన్‌కౌంటర్ చేసినట్లు చెబుతున్నారు.