Dalit Bandhu : దళిత బంధులో భారీగా మార్పులు…జాబితాలో ముందుగా వారికే చోటు..!!

  • Written By:
  • Publish Date - November 29, 2022 / 08:58 AM IST

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకంలో భారీ మార్పులు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. లబ్దిదారుల ఎంపిక విధానంలో మార్పులు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతం నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే సిఫార్సు జాబితాను ఆధారంగా చేసుకుని దాని ఆధారంగా లబ్ధిదారులకు ఆర్థికసాయాన్ని అందిస్తున్నారు. అయితే ఈ విధానంతో ఎమ్మెల్యే అనుచరులు మాత్రమే లబ్ధి పొందుతున్నారన్న ఆరోపణలు చాలా ఉన్నాయి. అసలైన లబ్దిదారులకు న్యాయం దక్కడం లేదంటూ గతంలో ఎన్నో ఫిర్యాదు వచ్చిన సంగతి తెలిసిందే. క్షేత్రస్థాయిలో వచ్చిన ఈ ఆరోపణలన్నింటినీ ద్రుష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఈమధ్య తమకు దళిత బంధు పథకంలో అన్యాయం జరిగిందంటూ కొంతమంది దళితులు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా నేరుగా దళితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో అసలైన లబ్దిదారులకే దళిత బంధు వర్తించేలా నిబంధనల్లో మార్పులపై సర్కార్ ఫోకస్ పెట్టింది. అసలైన లబ్దిదారులను గుర్తించేందుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక కమిటీని ఏర్పాటు చేసే అంశంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.

ఈ మేరకు ఎస్సీ అభివ్రుద్ధి శాఖ సూచనలతోపాటుగా ఎమ్మెల్యేల సూచలను కూడా కోరింది. జిల్లా స్థాయిలో ఆర్డిఓ లేదా జిల్లా అధికారి ఆద్వర్యంలో కమిటీ ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని అధికారులు సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం దళిత బంధు కింద ప్రతి నియోజకవర్గానికి 5వందల మంది చొప్పున లబ్దిదారులను ఎంపిక చేయాల్సి ఉండగా…దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ కోర్టు సూచనలతో అలాగే నిలిచిపోయింది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన తర్వాతే అసలైన లబ్దిదారులను గుర్తించే ప్రక్రియ చేపడతామంటూ అధికారులు వెల్లడించారు.