Masks Rules: తెలంగాణలో ‘మాస్క్’ తప్పనిసరి కాదు!

కరోనా మహమ్మారి కారణంగా తెలంగాణ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

  • Written By:
  • Updated On - April 1, 2022 / 03:39 PM IST

కరోనా మహమ్మారి కారణంగా తెలంగాణ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైరస్ బారి నుంచి తప్పించుకునేందుకు మాస్క్ ధరించాల్సి వచ్చింది. ప్రభుత్వం కూడా ఆంక్షలు విధించడంతో మాస్క్ తప్పనిసరైంది. ఈ నేపథ్యంలో కరోనా మూడో వేవ్ నెమ్మదించడం, కేసులు తగ్గుతుండటంతో తెలంగాణ వైద్య శాఖ కీలక విషయాలను వెల్లడించింది. ఈ సందర్భంగా తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు మీడియా సమావేశంలో మాస్క్ నిబంధనల గురించి మాట్లాడారు.

60 ఏళ్లు పైబడిన వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలున్నవాళ్ల తప్ప మిగతా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం ‘వ్యక్తిగత విషయం’ అని అన్నారు. రాష్ట్రంలో కోవిడ్ అదుపులోకి వచ్చిందని, ప్రతిరోజూ 30-40 కేసులు మాత్రమే నమోదవుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కోవిడ్ పై ఉన్న ఆంక్షలను ఎత్తివేసిందని విషయాన్ని గుర్తుచేస్తూ.. ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 60 ఏళ్లు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఆసుపత్రులకు వెళ్లినప్పుడు, మాస్క్‌లు ధరించడం మంచిదని ఆయన అన్నారు. ముఖ్యంగా మాల్స్‌, మార్కెట్‌ల వంటి రద్దీ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు మాస్క్ ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే ఇప్పటికీ బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ నిబంధనలను పాటించకపోతే అధికారులు జరిమానా కూడా విధిస్తున్నారని హెల్త్ డైరెక్టర్ గుర్తు చేశారు.

తెలంగాణలో మార్చి 31, గురువారం కేవలం 31 కొత్త కేసులు నమోదయ్యాయి, మొత్తం కేసుల సంఖ్య 7.91 లక్షలకు చేరుకుంది. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 7.86 లక్షలు అని ఆరోగ్య శాఖ బులెటిన్ తెలిపింది. రికవరీ రేటు 99.42%గా ఉంది. హైదరాబాద్‌లో అత్యధికంగా 23 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరణాల రేటు 0.51%. మొత్తం 33 జిల్లాల్లో 20కి పైగా జిల్లాల్లో సున్నా కేసులు నమోదవుతుండగా, ఆరు-ఏడు జిల్లాల్లో ఒకటి లేదా రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయని ఆయన చెప్పారు. భవిష్యత్తులో రాష్ట్రంలో జీరో కేసులు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. అయితే  కోవిడ్-19 ముప్పు పూర్తిగా పోలేదని,  ఆంక్షలు లేనప్పటికీ ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.