బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఇటీవల తెలంగాణ భవన్ కు వచ్చినప్పుడు ‘సీఎం,సీఎం’ అనే నినాదాలు మిన్నుముట్టాయి.ఆ పార్టీ హెడ్ క్వార్టర్ లో ఆ నినాదాలు మార్మోగాయి.ఇలాంటి నినాదాలు చేయడం పట్ల కేసీఆర్ వందిమాగధులు,భక్త సమాజం సభ్యులు ఆక్షేపిస్తున్నారు.”కేసీఆర్ ను ఇలా సీఎం పదవికి పరిమితం చేసేలా నినాదాలు చేయడం కేసీఆర్ అవమానించడమే.ఆయనను వ్యక్తిగతంగా కించపరచడమే.కేసీఆర్ ఔన్నత్యాన్ని తక్కువ చేయడమే.ఆయన ప్రతిష్టను చులకన చేయడమే.ఒక రాష్ట్రానికి ఆయన ఆలోచనలు ఎప్పుడూ పరిమితం కాదు.కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కేసీఆర్ కు గుర్తింపు ఉన్నది.ఆయన విజన్ వేరు.ఆయన పదేండ్ల పాటు తెలంగాణను పరిపాలించిన తీరు దేశానికి రోల్ మోడల్ గా మారింది.ఏ రాష్ట్రమైనా,ఏ ప్రాంతమైనా కేసీఆర్ కు పేదవాడు ముఖ్యం.పేదరికం ఎలా నిర్మూలించాలి?తెలంగాణ లాగే దాదాపు అన్ని రాష్ట్రాలలోనూ సహజవనరులు పుష్కలంగా ఉన్నాయి.వాటిని ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోతున్నామని ఆయన తరచూ ఆవేదన వ్యక్తం చేస్తుంటారు.ఆయనను దేశ నాయకుడుగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు ” అని బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఒక ఛానల్ ఇంటర్వూలో అన్నారు.
కర్నె ప్రభాకర్ ఒక్కరే కాదు,చాలామంది ఇదే అభిప్రాయంతో,ఇదే ఆలోచనా విధానంతో,ఇదే భక్తి భావనతో మాట్లాడుతున్నారు. పూర్వాశ్రమంలో రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు కేసీఆర్ పార్టీలో చేరగానే సమూలంగా మారిపోతున్నారు. వాళ్లందరిలో గుణాత్మక మార్పు కనబడుతోంది.నేనిక్కడ ఎవరి పేరునూ ప్రస్తావించదలచుకోలేదు.కానీ కేసీఆర్ లో వాళ్లకు ‘దేవుడు’ కనిపిస్తుండవచ్చు. అందువల్ల ‘మార్క్సిజం – లెనినిజం – కేసీఆర్ ఆలోచనా విధానం’ వర్ధిల్లాలి అని పరోక్షంగా నినదిస్తున్నారు.మూడు, నాలుగు దశాబ్దాల కిందట కమ్యూనిస్టు పార్టీలు,మార్క్సిస్టు – లెనినిస్టు పార్టీలకు అనుబంధంగా విద్యార్థి సంఘాల్లో పనిచేసిన వారు 2014 నుంచి,లేదా అంతకు ముందు నుంచి కూడా కేసీఆర్ ను ‘గొప్ప నాయకుడు’ గా గుర్తిస్తున్నారు.
ఈ మధ్యనే ఒక కవి రచించిన ‘వందేళ్ల ముందు చూపు’ అనే పుస్తకాన్ని కేసీఆర్ తన ఫార్మ్ హౌజ్ లో ఆవిష్కరించినపుడు,ఆ కవి కళ్ళలో మెరుపులు కనిపించాయి.’ఆత్మగౌరవం’ అనే పదాన్ని ఇంటిదగ్గరే వదిలేసి చాలామంది ‘మాజీ లెఫ్ట్’ భావజాల మనుషులందరూ నరనరాన ‘భూస్వామ్య లక్షణాలు’ నింపుకున్న కేసీఆర్,కేటీఆర్ లకు ‘సాగిలపడడం’ ఈ దశాబ్దపు గొప్ప విషాదం.ప్రజాస్వామ్యం,స్వేచ్ఛ అనే అంశాలు తమ డిక్షనరీ నుంచి తామే తొలగించుకొని మొహమాటం లేకుండా కేసీఆర్ దగ్గర ‘బానిసత్వం’ చేయడానికి సిద్ధపడ్డారంటే… కేసీఆర్ దగ్గర ఏదో అతీంద్రియ శక్తులున్నట్టుగానే భావించాలని కొందరు విమర్శకులు అంటున్నారు.’అరి వీర మాజీ లెఫ్ట్’ నాయకులు,ఆ భావజాల మేధావులందరిని తన వైపునకు లాక్కోగలిగారంటే ఖచ్చితంగా ఆయన దగ్గర ఏదో ‘వశీకరణ మంత్రం’ ఉండే ఉంటుంది.
వందేళ్ల తర్వాత తెలంగాణ ఎలా ఉండాలో ఇప్పుడే కేసీఆర్ ‘భవిష్యత్ దర్శనం’ చేసినట్టుగా మనలాంటి సామాన్యప్రజలు భావించవలసి ఉంటుంది.’మాజీ ముఖ్యమంత్రి’ అని ఎవరయినా సంబోధిస్తే,సదరు ‘భక్త సమాజం’ ఎంత మాత్రం సహించడం లేదు.’తెలంగాణ తొలి ముఖ్యమంత్రి’ గా మాత్రమే పిలవాలని వాళ్ళు ‘ఫత్వా’ జారీ చేస్తున్నారు.కనుక మనందరం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడవలసి ఉన్నది. జాగ్రత్తగా రాయవలసి ఉన్నది.’వందేళ్ల ముందుచూపు’ అన్నది అతిశయోక్తిగా ఉన్నది కానీ,’పదేండ్ల ముందుచూపు’ ఉన్నట్టు మాత్రం 2014 నుంచి 2024 దాకా కేసీఆర్ పరిపాలించిన తీరును లోతుగా అధ్యయనం చేస్తే తప్ప అర్ధం కాదు.ఆయన చేసిన పనులు :
1. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు,రాసేవాళ్ళు ప్రభుత్వం వెలుపల ఉండరాదు.
2. ప్రజలకు గొర్రెలు,బర్రెలు ఇచ్చి కులవృత్తులను గౌరవించినట్టుగా చిత్రించాలి.
3. తెలంగాణ ప్రజలు బానిసలుగా ఉండడానికి దశాబ్దాలుగా అలవాటు పడినందున వాళ్ళ మనసు గెలవాలంటే విచ్చలవిడిగా ఉచిత పథకాలు అమలు చేయాలి.
4. ప్రజలు అడిగితే ఇవ్వడం కాదు,అడగకుండానే వరాలు ఇవ్వడం.
5.రైతు బంధు,రైతుభీమా,దళితబంధు వంటి కార్యక్రమాలను పెద్దఎత్తున అమలు చేయడం.
6.ప్రజల దగ్గర ఎప్పుడూ ఏదో ఒక రూపంలో డబ్బు కనిపిస్తున్నప్పుడు, ప్రభుత్వం ఏమి చేస్తున్నదో, ప్రభుత్వ కార్యక్రమాల అంతరార్ధం ఏమిటో తెలుసుకోరు.
7.ఉద్యమకాలంలోనూ,అధికారంలో ఉన్న సమయంలోనూ తమ కుటుంబం,తన బంధుమిత్రులు,ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు,అదే సామాజికవర్గం అధికారులు,సిబ్బంది,పోలీసులు… ఎలా ఇష్టారాజ్యంగా పనిచేశారో,ఎంతలా అధికార దుర్వినియోగం చేశారో,ఎంత మేరకు దండుకున్నారో,పంటికి అందకుండా వేలాది ఎకరాల భూములను ఎలా మింగివేశారో అంతు లేని కథ.
8. ‘మనవాళ్ళ కోసం మనమే చెయ్యాలి.ఇంకెవరు చేస్తారు’ అనే దృక్పథంతో ‘పెద్ద సారు’ ప్రత్యక్షంగా,పరోక్షంగా అండ దండలు ఇచారన్న అపవాదు ఉన్నది.
ఇదంతా ప్రణాళికా బద్ధంగా సాగిన ‘విధ్వంసం’గా కొన్ని విశ్లేషణలున్నవి.ఫ్లై ఓవర్లు,వెలుగు జిలుగుల భవంతులు,భారీ కట్టడాలు,తాగు,సాగు నీటి ప్రాజెక్టుల నీడ ఆ ‘విధ్వంసాన్ని’ కనుమరుగు చేశాయి.ఆంధ్రప్రదేశ్ విభజన జరగకపోతే ఆ ‘సామాజిక వర్గానికి’ అధికారం ఎన్నటికీ దక్కేది కాదన్నది నిజం.అందుకే ‘దీపం’ ఉండగానే సదరు సామాజికవర్గం ఇల్లు చక్కబెట్టుకున్నది.వాళ్ళ మద్దతు,సహకారం,ప్రోత్సాహంతో టూ వీలర్ వాహనం కూడా దిక్కులేని వ్యక్తుల ప్రస్తుత ఆస్తి పాస్తులేమిటో,రియల్ ఎస్టేట్ వ్యాపారాలేమిటో,ఫార్మ్ హౌజ్ లు,కోడి పందేలు,క్యాసినో వంటి జూద గృహాలు,వందల కోట్ల విలువ చేసే వైన్ షోరూంలు… ఇలా ఒక్కటేమిటి… అలాంటి చట్ట వ్యతిరేక,అక్రమార్జనకు అలవాటు పడిన వాళ్ళు మళ్ళీ కేసీఆర్ /కేటీఆర్ ను కాకుండా అధికారంలో ఎవరిని కోరుకుంటారు?
కాగా కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రాకపోవచ్చు అని ఎవరూ నిర్ధారించలేరు,అలాగే తప్పకుండా వస్తారని కూడా చెప్పడంఅంతకన్నా కష్టం. ప్రజాస్వామ్యంలో అనూహ్య పరిణామాలు సంభవిస్తాయి.తెలంగాణలో రాజకీయ పరిణామాలు అత్యంత వేగంగా మారుతూ ఉంటాయి.ఎన్నికల్లో గెలవడానికి చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి.కేసీఆర్ పాలనపై ప్రజలకు 2023 లో ఉన్న అభిప్రాయం మారిందా లేదా? అన్నది స్పష్టం కావలసి ఉన్నది.ఎన్నికలకు ముందు కేసీఆర్ అనేకా వ్యూహాలు రచిస్తారు.తమ హయాంలోని సంక్షేమ పథకాల మార్కెటింగ్ ,మళ్ళీ ప్రాంతీయ వాదన పునరుజ్జీవం వంటి వ్యూహాలుంటాయి.అయితే ఈ సారి టీడీపీ,బీజేపీ,జనసేన కూటమి రంగంలో దిగే సూచనలున్నాయి.అందుకే కేసీఆర్ మొన్నటి పార్టీ కార్యవర్గ సమావేశంలోనే ‘చంద్రబాబు మరో రూపంలో రాబోతున్నాడు’ అని అన్నారు.’మొదటి ప్రమాద హెచ్చరిక’ ను కేసీఆర్ జారీ చేశారు.కనుక వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి,కాంగ్రెస్ పార్టీలతో బిఆర్ఎస్ తలపడవలసి ఉన్నది.రేవంత్ రెడ్డి,ఎన్డీఏ కూటమితో ‘యుద్ధం’ చేయడం మామూలు విషయం కాదు.అందుకే తెలంగాణ సెంటిమెంటుకు కేసీఆర్ ఇప్పటి నుంచే పదునుబెడుతున్నారు.అదొక్కటే తమను బతికించగలదని ఆయన బలంగా నమ్ముతున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు వర్కవుట్ అయితే ప్రజల విశ్వాసం పొందవచ్చు.ఈ లోగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ ను బలహీనపరచడానికి,కేసీఆర్ నాయకత్వాన్ని దెబ్బతీయడానికి ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తారో చూడాలి.కేసీఆర్ అనుభవజ్ఞుడు,రాజకీయ వ్యూహకర్త.కానీ ఫార్మ్ హౌజ్ పాలనను,గడీ పాలనను ప్రజలు ఆమోదించరు.ఆ నమ్మకాన్ని ప్రజల్లో కల్పించడం కేసీఆర్ కు సాధ్యం కాదు. మరలా అధికారం కట్టబెడితే ఫార్మ్ హౌజ్ నుంచే కేసీఆర్ పరిపాలిస్తారని,ప్రజల దగ్గరకు రారని,ప్రజలకు అపాయింట్ ఇవ్వరని సామాన్యప్రజలు అనుకుంటున్నారు.బిఆర్ఎస్,కాంగ్రెస్ ల మధ్య బీజేపీ ఇదివరకటికన్నా ఎక్కువ పుంజుకునే సంకేతాలు కనిపిస్తున్నవి.బీజేపీ కూటమిగా వస్తే దాన్ని ఎదుర్కోవడం అంత సులభం కాదు.
కాగా 1934 లో చైనాలో కమ్యూనిస్టులను తుడిచిపెట్టడానికి చియాంగ్ ప్రభుత్వం ప్రయత్నించింది.కొన్నాళ్ళకు మావో దగ్గర 10,000 మంది సైనికులు కూడా మిగలలేదు.1937 నాటికి చైనాను జపాన్ ఆక్రమించుకున్నది.కమ్యూనిస్టుల వల్ల ప్రమాదం లేదని చియాంగ్ అనుకున్నాడు.కనుక కమ్యూనిస్టులను వేటాడడం మానేశాడు.జపనీయులను టార్గెట్ చేశాడు.మావో సేటుంగ్ వ్యూహాత్మకంగా వ్యవహరించి లాంగ్ మార్చ్ నిర్వహించి కమ్యూనిస్టులను శక్తివంతులుగా మార్చడమే కాకుండా చియాంగ్ సేనలను చిత్తుగా ఓడించాడు.ఇందులో యుద్ధ నీతి ఏమిటంటే శత్రువును సమూలంగా నిర్మూలించడం.చియాంగ్ విఫలమైన వ్యూహాన్ని మావో అమలు చేశాడు.అయితే అప్పటి పరిస్థితులు,రాజకీయాలు,యుద్ధాలు వేరు.ఇప్పటి ఎన్నికల రణతంత్రం వేరు.ప్రత్యర్థులను తెలంగాణ రాజకీయచిత్రపటంలో లేకుండా చేయాలని కేసీఆర్ పన్నిన పన్నాగం భగ్నమైంది.మావో సూత్రాన్ని ఫాలో అయినా కాకపోయినా రేవంత్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకొని కేసీఆర్ ను చిత్తు చేయగలిగింది.
రాజకీయరంగంలో తనకన్నా గొప్ప తెలివి తేటలు కలిగిన వారెవరూ లేరని విర్రవీగే వ్యక్తులందరికీ ఇదే గుణపాఠం.ప్రత్యర్థులను యుద్ధంలో ఎలా గెలవాలన్న చాణక్యం,చాకచక్యం ఉండాలి గానీ మొత్తంగా వారిని నిర్వీర్యం చేయాలనో,నిర్మూలించాలనుకునో కలలు కనడం వృధా.టీడీపీ,కాంగ్రెస్,ఇతర పార్టీలను పూర్తిగా తుడిచిపెట్టాలని కేసీఆర్ గట్టిగా ప్రయత్నించారు.కానీ రివర్స్ అవుతుందని రేవంత్ రెడ్డి రూపంలో సుడిగాలి ముట్టడిస్తుందని అంత పెద్ద మేధావి ఊహించలేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.