సర్పంచ్ పదవి కోసం ఓ వ్యక్తి చేసిన ప్రయత్నం విఫలమైంది. ఎస్సీ మహిళలకు రిజర్వ్ అయిన స్థానాన్ని దక్కించుకోవడానికి అతను ఒక ఎస్సీ మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే.. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత ఓటరు జాబితాలో ఆమె పేరు చేర్చడానికి గడువు ముగియడంతో అతని ప్రణాళిక బెడిసికొట్టింది.
రాజకీయాల్లో కొన్నిసార్లు చిత్ర విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటాయి. కొందరు పదవి కోసం ఏళ్లకు ఏళ్లు ఎదురు చూస్తుంటారు. అయినా.. తమ కోరిక మాత్రం తీర్చుకోలేక సన్యాసం తీసుకుంటారు. ఇంకొందరు పట్టిందల్లా బంగారం అయినట్లు కోరుకోని పదవులు కూడా వచ్చి వరిస్తుంటాయి. తెలంగాణ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ కారణంగా వికారాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో ఓకే కుటుంబానికి మూడు పదవులు వచ్చాయి. ఆ గ్రామం సర్పంచ్ ఎస్టీ రిజర్వ్‌డ్ కాగా.. ఒక్కటే ఎస్టీ కుటుంబం ఉండటంతో కోరుకోకున్నా పదవి వరించింది.
అయితే కరీంనగర్ జిల్లాలో మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. రాజకీయలపై ఆశ, సర్పంచ్ కావాలనే కోరిక ఓ వ్యక్తి వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేసింది. ఈ ఘటన గంగాధర మండలంలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని ఓ గ్రామంలో సర్పంచి స్థానం ఎస్సీ మహిళలకు రిజర్వ్ అయింది. ఆ గ్రామంలో రాజకీయాలపై విపరీతమైన ఆసక్తి ఉన్నప్పటికీ.. అవివాహితుడైన ఒక వ్యక్తి ఈ రిజర్వేషన్‌ను సద్వినియోగం చేసుకోని సర్పంచ్ పదవిని దక్కించుకోవాలని బలంగా నిర్ణయించుకున్నాడు.
సర్పంచ్ పదవి దక్కించుకోవడం కోసం.. అతను నల్గొండ జిల్లాకు చెందిన ఒక ఎస్సీ మహిళను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. రిజర్వేషన్‌ను పొందడానికి ఆమెను గ్రామానికి తీసుకువచ్చి.. ఆమె పేరును తక్షణమే స్థానిక ఓటరు జాబితాలో చేర్చాలని భావించాడు. అనుకున్నదే ఆలస్యం వివాహానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. అయితే అతను ఊహించని విధంగా.. రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం (నవంబర్ 25) పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇక ఆలస్యం చేయకుండా సదరు వ్యక్తి బుధవారం (నవంబర్ 26) నాడు హడావుడిగా ఓ ఆలయంలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు.
పెళ్లైతే చేసుకున్నాడు కానీ, అంతకుముందే నోటిఫికేషన్ రావడంతో ఓటరు జాబితాలో పేరు నమోదు చేయడానికి గడువు ముగిసిపోయింది. దరఖాస్తు చేయడంలో ఆలస్యం జరగడం, నిబంధనల గడువును సరిగా పాటించకపోవడం వల్ల అతని భార్య పేరు ఓటరు జాబితాలో చేర్చబడలేదు. దీంతో, సర్పంచ్ పదవి దక్కించుకోవాలనే ఏకైక లక్ష్యంతో చేసుకున్న ఆ హడావుడి వివాహం వృథా అయ్యింది. ఆమె పేరు ఓటరు జాబితాలో లేకపోవడంతో.. ఆమె నామినేషన్ వేయడానికి అర్హత లేకుండా పోయింది. గ్రామ పెద్దలు, స్థానికులు ఈ సంఘటనను చూసి ‘ పెళ్లి మాత్రం బాగానే జరిగింది.. కానీ అదృష్టం మాత్రం కలిసి రాలేదు’ అంటూ ఇది విధి చేసిన వింతగా చర్చించుకుంటున్నారు. ఇలా రాజకీయ లక్ష్యం నెరవేరకపోవడంతో ఆ వ్యక్తి కల చెదిరిపోయింది.
