Manukota Stones : మానుకోట ఘటనకు 14 ఏళ్లు.. మర్చిపోలేనన్న హరీశ్ రావు.. అసలేం జరిగింది ?

మానుకోట ఘటన జరిగి నేటికి సరిగ్గా 14  ఏళ్లు.  2010 మే  28న జరిగిన ఈ ఘటనపై ఇవాళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ట్వీట్ చేశారు.

  • Written By:
  • Updated On - May 28, 2024 / 12:42 PM IST

Manukota Stones : మానుకోట ఘటన జరిగి నేటికి సరిగ్గా 14  ఏళ్లు.  2010 మే  28న జరిగిన ఈ ఘటనపై ఇవాళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ట్వీట్ చేశారు. మానుకోట ఘటన తెలంగాణ ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది అని ఆయన చెప్పారు. ఆధిపత్య అహంకారంతో తుపాకులు ఎక్కుపెట్టిన అప్పటి పాలకులకు మానుకోట రాళ్లే సమాధానం చెప్పాయన్నారు. తుపాకీ తూటాలకు దీటుగా సామాన్య ప్రజల రాళ్లు తిరగబడ్డాయని పేర్కొన్నారు.  పోలీసుల బుల్లెట్లకు ప్రతిస్పందిస్తూ ఉద్యమ కారులు చూపిన తెగువకు సమైక్య పాలకులు వెనుదిరగక తప్పలేదని హరీశ్‌రావు గుర్తుచేశారు.

We’re now on WhatsApp. Click to Join

తెలంగాణ ఉద్యమం ఉనికినే ప్రశ్నార్ధకంగా మార్చే కుట్రను మానుకోట మట్టి సాక్షిగా ఉద్యమకారులు ఏకమై తిప్పి కొట్టారని హరీశ్ రావు కొనియాడారు. తద్వారా స్వరాష్ట్ర ఆకాంక్షను మానుకోట ప్రజలు యావత్ దేశానికి బలంగా చాటిచెప్పారని పేర్కొన్నారు. తుపాకీ తూటాలకు వెరవకుండా.. లాఠీలకు భయపడకుండా మానుకోట ప్రజలు చూపిన సాహసానికి సలాం అని ఆయన వ్యాఖ్యానించారు. స్వరాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా ఆనాడు జరిగిన ఉద్యమానికి మానుకోట ప్రజలు ఊపిరులు ఊదారని ప్రశంసలు కురిపించారు. మానుకోట ఘటనకు సంబంధించిన చారిత్రక సన్నివేశాలు ఇంకా తన కళ్ల ఎదుటే కదలాడుతున్నాయని హరీశ్ రావు చెప్పుకొచ్చారు. ఆ ఘటన చరిత్రపుటల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.

Also Read : Ministers Quarters: మినిస్టర్స్ క్వార్టర్స్‌లో చోరీ.. నిర్మాణ సామగ్రి మాయం

2010 మే 28న మానుకోటలో ఏం జరిగింది ?

  • వైఎస్ జగన్ 2010 సంవత్సరం ప్రారంభంలో పార్లమెంటులో సమైక్య ప్లకార్డును ప్రదర్శించారు.
  • 2010 మే 16న మానుకోట నుంచి తన ఓదార్పు యాత్రను ప్రారంభిస్తానని ప్రకటించారు.
  • జగన్‌ను తెలంగాణలోకి కాలు మోపనివ్వమని రాజకీయ జేఏసీతో పాటు టీఆర్‌ఎస్‌, న్యూడెమోక్రసీ, ఓయూ, కేయూ, న్యాయవాద జేఏసీలు ప్రకటించాయి.
  • 2010 మే 28న జగన్‌ పర్యటనను అడ్డుకోవడానికి ప్రొఫెసర్‌ కోదండరాం, తన్నీరు హరీష్‌రావు, ఈటల రాజేందర్‌, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి మానుకోటకు చేరుకున్నారు.
  • జగన్‌ను స్వాగతించేందుకు కొండా సురేఖ, మాలోతు కవిత, కొండా మురళి, పుల్లా పద్మావతి, రెడ్యా నాయక్, భూమన కరుణాకర్‌రెడ్డి తమ అనుచరులతో మానుకోట రైల్వే స్టేషన్‌ వెయిటింగ్‌ రూంకు చేరుకున్నారు.
  • రైల్వేస్టేషన్‌ వెయిటింగ్‌ రూం నుంచి ఉద్యమకారులపైకి పిస్టల్స్‌‌తో కాల్పులు జరిగాయి. కాంగ్రెస్‌ నేతల అనుచరులు కట్టెలు, రాళ్లతో తెలంగాణవాదులపై దాడికి వచ్చారు.
  • దీంతో తెలంగాణవాదులు రైల్వే లైన్‌పై ఉన్న కంకరరాళ్లను(Manukota Stones) తూటాలుగా మలుచుకుని ఎదురుదాడికి దిగారు.
  • ఈ దాడుల్లో 15 మంది తెలంగాణ వాదులు, 25 మంది సమైక్యవాదులు గాయపడ్డారు.