Anam Mirza : రంజాన్ సందర్భంగా టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా నిర్వహించిన ‘దావతే రంజాన్’ ఎగ్జిబిషన్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో ఉన్న కింగ్స్ ప్యాలెస్‌లో ఈ ఎగ్జిబిషన్‌ను నిర్వహించగా.. ఓ వ్యక్తి తుపాకీతో గాల్లోకి ఫైరింగ్ చేయడం కలకలం రేపింది. అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఎగ్జిబిషన్‌లో సెంటు దుకాణం ఏర్పాటు చేసిన వ్యాపారికి, బొమ్మల దుకాణం ఏర్పాటు చేసిన వ్యాపారికి మధ్య జరిగిన వాగ్వాదం తీవ్రరూపు దాల్చింది. ఈక్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన హసీబుద్దీన్ అలియాస్ హైదర్ అనే వ్యక్తి జేబులో నుంచి తుపాకీ తీసి గాల్లోకి రెండు సార్లు ఫైరింగ్ చేశాడు.
ఏ దుకాణదారుడితోనూ సంబంధం లేకున్నా..
దీనిపై సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అతడిని అదుపులోకి తీసుకున్నారు. హసీబుద్దీన్ వద్దనున్న తుపాకీని సీజ్ చేశారు. అతడికి సెంటు దుకాణదారుడితో కానీ, బొమ్మల దుకాణదారుడితో కానీ సంబంధం లేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి. మరి ఎందుకు కాల్పులు జరిపాడు అనేది తెలియాల్సి ఉంది. నిందితుడు హసీబుద్దీన్ వద్ద లైసెన్సుడ్ తుపాకీ ఉందని తెలిసింది. ఆయుధాల చట్టం ప్రకారం అతడిపై కేసును నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు.
Also Read :Jagga Reddy Movie: నాపై ఎన్నో కుట్రలు.. నా జీవిత పోరాటాన్ని సినిమాలో చూపిస్తా : జగ్గారెడ్డి
ఆనం మీర్జా నిర్వహించే ఎగ్జిబిషన్ విశేషాలివీ..
ఏటా రంజాన్ టైంలో హైదరాబాద్ నగరంలోని ఫుడ్ ఫెస్టివల్స్, ఎగ్జిబిషన్‌లు ఏర్పాటవుతుంటాయి. గత కొన్నేళ్లుగా ఆనం మీర్జా(Anam Mirza) కూడా ‘దావతే రంజాన్’ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖ హీరోయిన్లను పిలిపించి ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తున్నారు. అందుకే ఈ ఎగ్జిబిషన్‌కు అనతి కాలంలో అనూహ్య రీతిలో క్రేజ్ వచ్చింది. ఎంతోమంది నగర ప్రజలు ఈ ఎగ్జిబిషన్‌కు హాజరై రకరకాల వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ఈ ఎక్స్‌పోలో దాదాపు 400 రిటైల్ స్టాల్స్, 60 ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. ఆనం మీర్జా 2012 నుంచే ఫ్యాషన్ క్యూరేటర్‌గా వ్యవహరిస్తున్నారు. సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్‌ను కూడా నిర్వహిస్తున్నారు. ఆమె ఏర్పాటు చేసిన దావతే రంజాన్ ఎగ్జిబిషన్ వల్ల దాదాపు 3వేల మందికి ఉపాధి లభించిందని సమాచారం. దీన్ని కేవలం 11 రోజుల్లోనే దాదాపు 2.50 లక్షల మంది సందర్శించారు. అలనాటి క్రికెట్ దిగ్గజం మహ్మద్ అజారుద్దీన్ కుమారుడు మహ్మద్ అసదుద్దీన్‌తో ఆనం మీర్జాకు వివాహం జరిగింది.