Site icon HashtagU Telugu

MallaReddy : మల్లారెడ్డి దారెటు..?

Mallareddy Bjp

Mallareddy Bjp

తెలంగాణ బీఆర్ఎస్ నేత, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Mallareddy) రాజకీయంగా ఓ క్లిష్ట దశలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన మల్లన్న, ఆ మధ్య కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారన్న వార్తలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో సీఎంను కలవడం, కుటుంబ వేడుకలకు ప్రభుత్వ పెద్దల్ని ఆహ్వానించడం ద్వారా పచ్చగులాబీ వైపు సానుభూతి చూపించడానికి ప్రయత్నించారన్న టాక్ సాగింది. కానీ కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో మల్లారెడ్డి ఇప్పుడు కమలం పార్టీ వైపు దృష్టి మళ్లించారన్న గాసిప్స్ వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్‌లోకి వెళ్లే ప్రయత్నం విఫలమవడంతో మల్లారెడ్డి తాజా వ్యూహం బీజేపీ గూటికి చేరడమేనంటూ వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఈసారి నేరుగా మల్లారెడ్డి కాకుండా తన కోడలు ప్రీతిరెడ్డి(Preethireddy)ని ముందుగా బీజేపీలోకి పంపించే ప్రయత్నాల్లో ఉన్నారట. ఇటీవల బీజేపీ కేంద్రమంత్రి బండి సంజయ్‌తో ప్రీతిరెడ్డి భేటీ కావడం, బోనాల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లెక్సీల్లో వారి ఫోటోలు కనిపించడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చాయి. దీంతో మల్లారెడ్డి కుటుంబం బీజేపీ వైపు అడుగులు వేస్తుందన్న రాజకీయ చర్చ తెరపైకి వచ్చింది.

Biryani leaves : బిర్యానీ ఆకులు..రుచి మాత్రమే కాదు,ఆరోగ్యానికి రహస్య ఆయుధం..ఎలాగంటే..?!

ఇక బీజేపీ (BJP) కూడా మల్కాజిగిరి నియోజకవర్గానికి సంబంధించి కీలక మార్పులు జరగే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య సున్నితంగా సాగుతున్న కోల్డ్ వార్ నేపథ్యంలో, మల్లారెడ్డి కోడల్ని రంగంలోకి దింపి ఈటల ప్రభావాన్ని తగ్గించాలన్న ప్లాన్ బండి సంజయ్‌ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. గతంలో ఎంపీ టికెట్ ఆశించిన ప్రీతిరెడ్డి ఈ సారి బీజేపీ తరఫున బరిలోకి దిగితే, మల్కాజిగిరిలో మల్లారెడ్డి కుటుంబం ఆధిపత్యం కొనసాగించవచ్చని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

ప్రస్తుతం మల్లారెడ్డి “కారు” గుర్తుతోనే ఉన్నప్పటికీ, పరిస్థితులను బట్టి సమయానుకూలంగా “కమలం” పటాన్ని ఎత్తేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో తమ విద్యాసంస్థలు, వ్యాపారాలకు అడ్డుదెబ్బ తగలకుండా ఉండేందుకే మెల్లగా మారుతున్నారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. వచ్చే ఎన్నికల్లో మల్లారెడ్డి కుటుంబం నుంచి మల్లారెడ్డి, కుమారుడు భద్రారెడ్డి లేదా కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ టికెట్లపై బరిలో దిగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే మల్లన్న దారి ఇప్పుడే క్లియర్ కాకపోయినా… మల్లారెడ్డి కుటుంబం కమలం వైపు కదులుతున్నదీ అనేది వాస్తవమని అంత మాట్లాడుకుంటున్నారు.